- పీఏసీఎస్ చైర్మన్ వేధింపులకు మాజీ సర్పంచ్ బలి
- అప్పు చెల్లించాలంటూ భార్యాభర్తల నిర్బంధం
- బ్యాంక్ లోన్ తీసుకోకుండా.. ఇల్లు అమ్ముకోకుండా అడ్డంకులు
- వేధింపులు భరించలేక ఆత్మహత్య
శాయంపేట, వెలుగు: రూ. 20 లక్షల అప్పు కింద రూ. 80 లక్షల ఇల్లు అమ్ముకోకుండా అడ్డుపడ్డాడు. రూ. 30 లక్షల బ్యాంక్ లోన్ ఆపేశాడు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వాలని భార్యభర్తలను ఇంట్లో నిర్బంధించాడు. తన అప్పు తీర్చితే తప్ప ఒరిజినల్ డాక్యుమెంట్లను ఇవ్వనని వేధించాడు. దీంతో అప్పు తీసుకున్న వ్యక్తి తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు ఇచ్చింది బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పీఏసీఎస్ చైర్మన్ కాగా అప్పు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది అదే పార్టీకి చెందిన మాజీ సర్పంచ్. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం హుస్సేన్‌పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భూతాల సురేశ్ శాయంపేటలో అడ్తి వ్యాపారం చేసేవాడు. బిజినెస్‌లో లాస్ రావడంతో శాయంపేట పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్ దగ్గర 5 నెలల కింద రూ. 20 లక్షల అప్పు చేశాడు. రూ. 2 మిత్తీతో కలిపి ఏడాది తర్వాత తీర్చేలా ఒప్పందం చేసుకున్నాడు.
అప్పు తీర్చడం కోసం శాయంపేటలో తన భార్య రాణి పేరిట ఉన్న రెండంతస్థుల భవనంపై బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించాడు. అయితే శరత్ లోన్ రాకుండా అడ్డుపడ్డాడు. రాణి పేరిట ఉన్న ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కోసం 20 రోజుల కింద భార్యాభర్తలను తన ఇంట్లో మూడు గంటల పాటు నిర్బంధించాడు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాతే వదిలిపెట్టాడు. అప్పు తీర్చడం కోసం సురేశ్శాయంపేటలోని ఇంటిని అమ్మడానికి ఈ నెల 16న బోర్డు పెట్టాడు. ఇద్దరు, ముగ్గురు రూ.80 లక్షల వరకు చెల్లించి ఇల్లు కొనడానికి ముందుకొచ్చారు. అయితే ఈ నెల 19న శరత్, అతని భార్య రమాదేవి ఇద్దరూ సురేశ్ ఇంటికి వెళ్లారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తమ దగ్గర ఉంటే ఇల్లు ఎలా అమ్ముతావంటూ పది మందిలో ఇష్టం వచ్చినట్లు తిట్టారు. వారిపై చేయి చేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సురేశ్ సెల్ఫీ వీడియోలో కుసుమ శరత్, అతని భార్య రమాదేవి తనను ఎలా ఇబ్బంది పెడుతున్నారో వివరించాడు. గురువారం సాయంత్రం 4 గంటలకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించగా రాత్రి చనిపోయాడు. మృతుని భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరభద్రరావు చెప్పారు.
నిందితులను అరెస్ట్ చేయాలంటూ రాస్తారోకో
సురేశ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన శరత్, రమాదేవి దంపతులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం శాయంపేట‒పత్తిపాక రోడ్డుపై మృతుడి బంధువులు, గ్రామస్తులు రాస్తారోకో చేశారు. కేవలం రూ. 20 లక్షల అప్పు కోసం రూ. 80 లక్షల ఇల్లు అమ్ముకోకుండా అడ్డుపడ్డ శరత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.