
- సూర్యాపేట జిల్లా మిర్యాలలో ఈ నెల 17న మాజీ సర్పంచ్ హత్య
- మొత్తం 40 మంది నిందితులు, 13 మంది అరెస్ట్
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో ఈ నెల 17న జరిగిన మాజీ సర్పంచ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజకీయ ఆధిపత్యం కోసం కూతుళ్లు, అల్లుండ్లు కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ నరసింహ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... మిర్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యగౌడ్‌కు ఐదుగురు కూతుళ్లు.
ఇందులో రెండో అమ్మాయిని తప్ప మిగతా వారందరినీ అదే గ్రామానికి చెందిన వ్యక్తులకు ఇచ్చి పెండ్లి చేశాడు. చక్రయ్య గౌడ్ గతంలో సర్పంచ్‌గా పని చేయడంతో గ్రామంలో మంచి పలుకుబడి ఉంది. దీంతో తన మూడో కూతురు సునీతను సర్పంచ్‌గా, అల్లుడు కనకటి వెంకన్నను పీఏసీఎస్ చైర్మన్‌గా గెలిపించుకున్నాడు. అయితే తాము పదవుల్లో ఉన్నప్పటికీ గ్రామంలో పలుకుబడి మాత్రం చక్రయ్యకే ఉండడంతో అల్లుడు వెంకన్న పగ పెంచుకున్నాడు. ఇటీవల జరిగిన బొడ్రాయి వార్షికోత్సవంలో సైతం చక్రయ్యే పెత్తనం చేయడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు.
దీంతో ఎలాగైనా మామ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో భార్య సునీతతో పాటు ఆమె తోబుట్టువులు స్వరూప, కనకటి కల్యాణి వారి భర్తలు ఉప్పలయ్య, లింగయ్యతో కలిసి చక్రయ్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. వీరికి మరో కూతురు అల్లుడు జక్కి స్వరూప, పరమేశ్ సహకరించారు. ఈ నెల 17న బంధువులు, కుటుంబ సభ్యులు మరికొందరితో కలిసి కర్రలు, గొడ్డళ్లతో చక్రయ్యపై దాడి చేసి హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేయగా హత్య కేసులో మొత్తం 40 మంది పాల్గొన్నట్లు గుర్తించారు.
ఇందులో ఆరుగురు ఇటీవల తుంగతుర్తి కోర్టులో లొంగిపోగా మరో ఆరుగురిని ఈ నెల 20న, ఏడుగురిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కనకటి శ్రవణ్, కనకటి లింగయ్య, కనకటి ఉప్పలయ్య, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేశ్, పెద్దింటి మధు, పెద్దింటి గణేశ్‌తో పాటు చక్రయ్య గౌడ్ కూతుళ్లు, అల్లుండ్లు ఉన్నారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
పోలీసుల తీరుపై మొదట విమర్శలు
చక్రయ్యగౌడ్ హత్య కేసులో పోలీసుల వ్యవహారంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కేసులో ప్రధాన నిందితులు కోర్టులో లొంగిపోయేలా పోలీసులు సహకరించారని చక్రయ్య కుటుంబసభ్యులు, అనుచరులు ఆరోపిస్తూ నిరసనలు తెలిపారు. కేసును పక్కదారి పట్టించారని, ఇందుకు లక్షల రూపాయలు చేతులు మారాయని కుటుంబసభ్యులు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆయన ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. దీంతో చక్రయ్య హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వారం రోజుల్లో నిందితులను పట్టుకున్నారు. హత్య విషయం పసిగట్టలేకపోయిన డీఎస్పీ రవి, సీఐ, ఎస్సైలకు మెమోలు జారీ చేశారు.