
ఖానాపూర్, వెలుగు: నిర్మల్జిల్లా ఖానాపూర్ మండలం మేడంపల్లి మాజీ సర్పంచ్ అంగోత్ సునీత, లింబాజీ దంపతులు సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు చోట్ల ఓటేశారని, వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం తహసీల్దార్ ఆఫీస్లో కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సర్పంచ్ దంపతులు ఖానాపూర్ మండలం మేడంపల్లిలోని 249 పోలింగ్ బూత్ లో ఓటు వేయడంతో పాటు సుర్జాపూర్ గ్రామంలోని 247 పోలింగ్ బూత్ లో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయాన్ని తాము ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీస్, రెవెన్యూ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఖానాపూర్ మాజీ పీఏసీఎస్ చైర్మన్ ఆకుల వెంకాగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దోనికేని దయానం ద్, మేడంపల్లి మాజీ సర్పంచ్ గుగ్లోత్ రాజేందర్, ఎంపీటీసీ జంగిలి శంకర్ ఉన్నారు.