మాజీ సర్పంచ్ భార్యపై దాడి..నారాయణ పేట జిల్లా చర్లపల్లిలో ఘటన

మాజీ సర్పంచ్ భార్యపై దాడి..నారాయణ పేట జిల్లా చర్లపల్లిలో ఘటన
  • ట్రాన్స్ ఫార్మర్ నిర్మాణ స్థలం తమదేనంటూ అఘాయిత్యం

ధన్వాడ, వెలుగు: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు స్థలంపై తలెత్తిన ఘర్షణలో మాజీ సర్పంచ్ భార్యపై అమానుషంగా దాడికి పాల్పడిన ఘటన నారాయణ పేట జిల్లా ధన్వాడ మండలంలో జరిగింది. ఎస్ఐ రమేశ్,​ గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. చర్లపల్లికి చెందిన మాజీ సర్పంచ్ అక్కమోళ్ల రాములు భార్య మొగులమ్మ గురువారం ఉదయం తన పొలంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుకు దిమ్మె నిర్మాణ పనులు చేయిస్తుంది. ఆ స్థలం తమదేనంటూ అదే గ్రామానికి చెందిన అయ్యప్పరెడ్డి మణెమ్మ, అయ్యప్పరెడ్డి భీమమ్మ, నారాయణరెడ్డి, నీరజ, అయ్యప్పరెడ్డి తిరుపతిరెడ్డి వెళ్లి ఆమెపై దాడి చేశారు. 

కులం పేరుతో తిడుతూ మొగులమ్మను కింద పడేసి కొడుతూ గొంతు పిసికేందుకు యత్నించారు. మొగులమ్మ  మామ అడ్డుకోబోగా ఆయనను తోసేశారు. అడ్డుకోవాల్సిన స్థానికులు కూడా ప్రోత్సహిస్తూ రెచ్చగొట్టారు.  బాధితురాలు మొగులమ్మకు గాయాలు అయ్యాయి. మాజీ సర్పంచ్ రాములు ధన్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

తమ భూమిలో ట్రాన్స్ ఫార్మర్ దిమ్మె నిర్మిస్తుండగా ఆకారణంగా దాడి చేయడమే కాకుండా కులం పేరుతో తిట్టిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ చేస్తున్నట్టు ఎస్ఐ రమేశ్​ తెలిపారు.