- సీఎం రేవంత్ రెడ్డికి శాట్జ్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర క్రీడా రంగాన్ని, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడిలో పెట్టాలని శాట్జ్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఇటీవల ప్రెసిడెంట్‌గా ఎన్నికైన టీఓఏ కొత్త కార్య వర్గానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) గుర్తింపు ఇవ్వలేదన్నారు. దాంతో ఉత్తరాఖండ్‌లో ఈ నెల 28వ తేదీ నుంచి జరిగే నేషనల్ గేమ్స్‌లో పోటీపడే తెలంగాణ జట్లు, క్రీడాకారులు అయోమయంలో పడిపోయారని చెప్పారు.
‘నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం పోటీకి అనర్హుడైనప్పటికీ టీఓఏ ప్రెసిడెంట్ పోస్టుకు పోటీపడి ఎన్నికైన ఏపీ జితేందర్ రెడ్డి టీఓఏ భవితవ్యాన్నే ప్రశార్థకంగా మార్చారు. ప్రస్తుతం రాష్ట్ర క్రీడా శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉంది. సీఎం ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర క్రీడారంగాన్ని గాడిలో పెట్టాలి. నేషనల్ స్పోర్ట్స్ కోడ్, ఐఓఏ నిబంధనల ప్రకారం టీఓఏకు తిరిగి ఎన్నికలు నిర్వహించేలా చేయాలి’ అని వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.