కవిత దీక్షతో ధర్నాచౌక్ అపవిత్రమైంది..ఫూలే విగ్రహం కోసం ధర్నాకు దిగడం సిగ్గుచేటు : డాక్టర్ పిడమర్తి రవి

కవిత దీక్షతో ధర్నాచౌక్ అపవిత్రమైంది..ఫూలే విగ్రహం కోసం ధర్నాకు దిగడం సిగ్గుచేటు : డాక్టర్ పిడమర్తి రవి
  •  ఫినాయిల్ తో ధర్నా చౌక్​ను క్లీన్ చేసిన పిడమర్తి రవి

ముషీరాబాద్, వెలుగు: జ్యోతిబాఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయడం సిగ్గుచేటు అని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి విమర్శించారు. ధర్నా చౌక్​ను ఎత్తేసిన కల్వకుంట్ల కుటుంబానికి చెందిన ఆమె దీక్షతో ధర్నా చౌక్ అప్రవితం అయిందన్నారు. తన అనుచరులతో కలిసి మంగళవారం సాయంత్రం ఫినాయిల్ తో ధర్నాచౌక్​ను క్లీన్​చేశారు. పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన కవితకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

దీక్షలో భాగంగా బీసీ సమాజాన్ని ఎండలో కూర్చోబెట్టి కల్వకుంట కుటుంబం మాత్రం ఏసీ స్టేజీపై కూర్చున్నదని మండిపడ్డారు. బీసీలు ఆమె మాటలను నమ్మితో మోసపోవడం ఖాయమన్నారు. బీసీలకు రాజ్యాధికారం వస్తే కేసీఆర్, కేటీఆర్, కవిత అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు. బీసీల పట్ల ప్రేమ ఉంటే ఆమరణ దీక్షకు పూనుకోవాలని సూచించారు. బీసీ నాయకత్వాన్ని డమ్మీ చేయడానికి కవిత ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

తన లిక్కర్​స్కాంతో ఢిల్లీ సీఎం అరవింద్​కేజ్రీవాల్​ను, రాష్ట్రంలో కేసీఆర్​ను ఇంటికే పరిమితం చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముందు బీఆర్ఎస్​పార్టీ ఆఫీసులో ఫూలే విగ్రహం పెట్టించాలని డిమాండ్​చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీసీ సమాజం సీఎం రేవంత్ రెడ్డి వెంటే ఉంటుందన్నారు. బొమ్మెర స్టాలిన్, మీసాల మల్లేశ్, ఎండీ రహీం, బోరెల్లి సురేశ్, నక్క మహేశ్, సాయన్న, వరలక్ష్మి, శేఖర్, మహేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.