
పలు రాష్ట్రాలకు గవర్నర్ లను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా నియమించారు. ఆయన స్థానంలో సయ్యద్ అబ్దుల్ నజీర్ నియామకమయ్యారు. ఈయన గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అబ్దుల్ నజీర్ ... చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించారు.
న్యాయశాస్త్ర పట్టా తీసుకున్న సయ్యద్ అబ్దుల్ నజీర్ 1983లో లాయర్ గా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత అదే హైకోర్టులో ఆయన ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 2017లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడే భారత సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. 2017లో సుప్రీంకోర్టులో ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బహుళ విశ్వాసాల బెంచ్‌లో నజీర్ ఏకైక ముస్లిం న్యాయమూర్తి. ఈ ఏడాది జనవరి 4న ఆయన పదవీ విరమణ చేశారు.