హైదరాబాద్, వెలుగు: పంచాయతీల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నామని రాష్ట్ర మాజీ సర్పంచులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేయనున్నామని రాష్ట్ర మాజీ సర్పంచుల జేఏసీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద మాజీ సర్పంచులు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. సర్పంచులు అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదని తెలిపారు.
ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీలో తమ సమస్యలను ప్రస్తావిస్తే కాంగ్రెస్ఎమ్మెల్యేలు అవహేళన చేస్తూ మాట్లాడారని చెప్పారు. పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, గణేష్, మల్లయ్య, పూర్ణచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.