
తిరుపతిలోని శ్రీవారి గోశాలలో ఆవుల మరణంపై వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 3 నెలల్లో తిరుపతి గోశాలలో 100కు పైగా ఆవులు చనిపోయాయని..ఈ విషయాన్ని దారుణంగా దాచిపెట్టారని అన్నారు భూమన. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి చెంత టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలలో ఇలా జరగడం దారుణమని.. పైగా దీన్ని దాచిపెట్టడం, అత్యంత హేయమని అన్నారు భూమన. సాక్షాత్తూ తిరుమల శ్రీవారి ఆలయం ద్వారాలు తెరిచేది కూడా గో సంరక్షకుడే అని..అలాంటి గోశాలలో ఇన్ని అవులు ఎలా చనిపోయాయో చూడండి అంటూ మీడియాకు ఫోటోలు చూపించారు భూమన.
అత్యంత పవిత్రంగా కొనసాగుతున్న టీటీడీ గోశాలలో పరిస్థితి దారుణంగా తయారయ్యిందని.. మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం. పాప ప్రక్షాళన చేస్తామని, టీటీడీ ప్రతిష్టను పెంచుతామని ప్రకటించిన పవనానంద స్వామి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు భూమన.దేవుడితో సమానమైన గోవులకు పట్టిన దుస్థితి ఇది అని... ఆవులు ఎన్నో చనిపోయినా, కారణాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని.. కనీసం వాటికి పోస్టుమార్టమ్ కూడా చేయలేదని మండిపడ్డారు భూమన.
3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయినా, టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని.. వారికి ఎంతసేపూ పాలకులకు ఊడిగం చేయడమే పని అని అగరహం వ్యక్తం చేశారు.గోశాలకు ఇంఛార్జ్‌గా ఒక అటవీ అధికారిని నియమించారని... నిజానికి ఆయనకు, గోశాలతో ఏ మాత్రం సంబంధం లేదని అన్నారు. తక్షణం గోవుల మరణంపై విచారణ జరపించాలని డిమాండ్ చేశారు భూమన.
►ALSO READ : Arjun S/O Vyjayanthi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయశాంతి, హీరో కళ్యాణ్ రామ్
ప్రకృతి పరిరక్షణ ఆవుపేడ వల్ల జరుగుతుందని.. గోమూత్రం ఆరోగ్య ప్రదాయమని.. ఎక్కడైనా ఆవు తన దూడతో గ్రాసం తింటే, ఆ ప్రాంతం పావనం అవుతుందని నమ్ముతున్నారని అన్నారు. గోవు పాలు తల్లి పాల కంటే మిన్న అని.. ఇంతగా గోవు పట్ల సనాతన ధర్మం మనకు బోధిస్తుంటే.. సాక్షాత్తూ టీటీడీ గోశాలలో అన్ని ఆవులు చనిపోయినా, టీటీడీ అధికారులు పట్టించుకోక పోవడం దారుణమని అన్నారు భూమన.
తమ పాలనలో దాదాపు 550 అత్యంత నాణ్యమైన ఆవులను, మంచి బ్రీడ్‌లను దాతల నుంచి సమీకరించామని... గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ నుంచి దాతల ద్వారా ఆవులు సేకరించి, రోజూ దాదాపు 1500 లీటర్ల పాలు సేకరించామని అన్నారు. రైల్వే మంత్రితో అధికారులు చర్చించి, ప్రత్యేక వ్యాగన్లలో వాటిని తీసుకురావడం జరిగిందని.. తమ హయాంలో రోజూ 1500 లీటర్ల పాలు సమీకరించే పరిస్థితి ఉంటే, ఈరోజు కనీసం 500 లీటర్లు కూడా కొండకు పోవడం లేదని అన్నారు భూమన.
ఎన్‌డీడీబీ వారి సహకారంలో రూ.150 కోట్ల వ్యయంతో సాహివాల్ వంటి మేలు జాతి ఆవుల పునరుత్పాదకత కోసం కృషి చేశామని... కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక, ఆ బ్రీడింగ్ విధానాన్నే మర్చిపోయిందని మండిపడ్డారు భూమన. తమ ప్రభుత్వంలో ఎన్‌డీడీబీ ఛైర్మన్‌ను తిరుపతికి తీసుకొచ్చామని... ఆవుల బ్రీడింగ్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం ప్రయత్నించామని అన్నారు.
కానీ, అప్పుడు తమ ప్రభుత్వంపై నిరంతరం దుష్ప్రచారం చేశారని.. తిరుపతిలో అనర్థాలు జరుగుతున్నాయని విష ప్రచారం చేశారని మండిపడ్డారు భూమన. తమ హయాంలో దాదాపు 2 వేల ఆవులను ఇక్కడి గోశాల ద్వారానే రైతులకు పంపిణీ చేశామని.. రైతుల సాధికార సంస్థ ద్వారా ఆవులను అందించామని.. వాటిని వారు అద్భుతంగా పోషిస్తున్నారని అన్నారు.
అన్ని మంచి పనులు చేస్తే, చంద్రబాబు, పవనానంద స్వామి తమ మీద విషం చిమ్మారని అన్నారు. ఇక ఆయన అనుకూల మీడియా, తమ మీద దుష్ప్రచారం చేశాయని అన్నారు భూమన. కానీ, ఇప్పుడు టీడీపీ కూటమి పాలనలో కనీసం గోశాలను కూడా రక్షించలేకపోతున్నారని... అక్కడ కేవలం ఇద్దరు వెటర్నరీ డాక్టర్లు, ఇద్దరు కాంపౌండర్లు మాత్రమే ఉన్నారని... వారు కూడా గోవులను కాపాడలేక పోతున్నారని అన్నారు భూమన.
తిరుపతి గోశాల గోవధశాలగా మారిందని..ఈ పాలకులు ఇంత కంటే ఘోర పాపం లేదని అన్నారు. శ్రీవారు గోపాలకుడు, గో రక్షకుడు. అందుకే ఆయన గోవిందుడు అయ్యాడని... మనం కూడా గోవిందా గోవిందా అంటామని అన్నారు. అంత పవిత్రమైన గోశాల ఇవ్వాల అంత దుస్థితికి చేరిందని, హిందూ సనాతనవాదులమని చెప్పుకున్న వారు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైన హైందవ ధార్మికులు, గోసంరక్షకులు స్పందించాలని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.
నిజానికి హైందవ ధర్మ పరిరక్షణ నాడు వైయస్సార్‌గారి హయాంలో, ఆ తర్వాత జగన్‌గారి హయాంలోనే జరిగిందని...ఇప్పటికైనా ఇక్కడ గోశాలలో జరుగుతున్న ఘోరకలిని చూడాలని హైందవ ధర్మ పరిరక్షకులను, సనాతనవాదులను కోరుతున్నానని అన్నారు భూమన.