కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ ఇకలేరు

  • కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూత

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ (82) కన్నుమూశారు. గురుగ్రామ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి తనదైన ముద్ర వేశారు.  గత నెల 20వ తేదీన కరోనా సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ కారణంగా దీర్ఘకాల చికిత్స తీసుకుంటున్నారు. ఇన్ ఫెక్షన్ తీవ్రం కావడంతో చికిత్స ఫలించక గురువారం ఉదయం కన్నుమూశారు. ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన ఆయన రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కాటుకు ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు కన్నుమూసిన విషయం తెలిసిందే. అజిత్ సింగ్ కూడా కరోనా కాటుకు గురై చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఆయన అనారోగ్యంతో చివరి వరకు పోరాడారు. అయితే ఇవాళ (గురువారం) ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు, మాజీ ఎంపీ జయంత్ చౌదరి ట్వీట్ చేశారు. 
అజిత్ సింగ్ మృతికి కేసీఆర్ సంతాపం
కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, చౌదరి అజిత్ సింగ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్  మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని గుర్తు చేసుకున్నారు.  రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ ప్రక్రియకు అజిత్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతు పలికిన వారి జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారని సిఎం అన్నారు. దివంగత అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి.. సంతాపం
మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు, మాజీ కేంద్రమంత్రి అజిత్ సింగ్ మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు  నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పార్లమెంటు సభ్యునిగా, కేంద్రమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ప్రజల కోసం పరితపించిన నాయకుడని కొనియాడారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలు రైతులకు ఎంతగానో ఉపయోగ పడ్డాయన్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వానికి ఆయన చేసిన కృషి అజరామరమని చంద్రబాబు పేర్కొన్నారు. పరిశ్రమల శాఖా మంత్రిగా, ఆహార మంత్రిగా ఆయన చేసిన సేవలను మరువలేనివని గుర్తు చేస్తూ అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.