తెలంగాణ ప్రజలపై సాగుతున్న దమనకాండను నిరసిస్తూ 1969 ఆగస్టు 18న పార్లమెంట్‌ల నేను, మెల్కోటె లొల్లి చేసినం. అమరుల ఫొటోలను పట్టుకొని నిరసన తెలిపినం. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసినం. వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరినం. తెలంగాణ సాధించేదాక మా పోరాటం ఆగదని తేల్చిచెప్పినం. – కాకా ఆత్మ కథ ‘మేరా సఫర్’ నుంచి
తెలంగాణ ప్రజలపై సాగుతున్న దమనకాండను నిరసిస్తూ 1969 ఆగస్టు 18న నేను, మెల్కోటె పార్లమెంట్‌ల లొల్లి చేసినం. చనిపోయిన అమరుల ఫొటోలను పట్టుకుని నిరసన తెలిపినం. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసినం. వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరినం. ‘‘నెత్తురు ఏరులై పారుతున్న తెలంగాణ నుంచి వచ్చినం. తుపాకీ గుండ్లను తప్పించుకుని వచ్చినం. ఇప్పటికే 250 మంది ఉద్యమకారులను కాల్చి చంపిన్రు. వందల మందిని పీడీ చట్టం కింద అరెస్టు చేసిన్రు. 50 వేలమందిని అక్రమంగ జైల్ల పెట్టిన్రు. ఈ రాక్షసకాండను ఖండిస్తున్నం. మాపై వలసవాదుల పెత్తనం వద్దు. మేం ఎవరికీ బానిసలం కాదు’’ అంటూ ఆవేశంగ మాట్లాడినం. ‘‘తెలంగాణ సాధించే దాక మా పోరాటం ఆగదు’’ అని తేల్చిచెప్పినం. ‘‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ’’ నినాదాలతో ఉపన్యాసాన్ని ముగించినం.
సాగర్, శ్రీశైలం డ్యామ్ కూలీల కోసం పోరాటం
నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి అప్పట్ల రోజుకు 45వేల మంది శ్రామికులు 12 ఏండ్ల పాటు తమ నెత్తురు ధారబోసిన్రు. ఆ కార్మికుల శ్రమకు తగిన విలువ దక్కకపోయేది. దాంతో నేను 1957ల డ్యాం కడుతున్న కార్మికులతో పాటు కెనాల్ పనులల్ల ఉన్న శ్రామికులను కలిసిన. వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి సమ్మె చేయించిన. నేను సాగర్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉంటె, గడ్డంపల్లి నారాయణరెడ్డి (జానారెడ్డి మామ) జనరల్ సెక్రటరీగా ఉండె. ఇద్దరం కలిసి వర్కర్స్ కోసం పోరాటం చేసినం. కార్మికుల సమ్మెతో ప్రభుత్వం దిగొచ్చింది. జీతాలను పెంచింది. ఇంతేకాదు కూలీలు ఉంటున్న గుడిసెలకు కరెంటు, నీటి సౌకర్యం కూడా కల్పించింది. ఇట్లనే శ్రీశైలం ప్రాజెక్టు కార్మికులు, పోచంపాడు ప్రాజెక్ట్ వర్కర్స్‌తో నేను యూనియన్ షురూ చేసిన. సాగర్ డ్యాం కార్మికుల లెక్కనే వాళ్లకు కూడా కనీస వేతనాలతో పాటు ఇతర అలవెన్సులు అమలు చేయించిన. ఈ పోరాటాలల్ల ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్ లు నాతో కలిసి పనిచేసినయ్. కూలీలు, కార్మికుల సమస్యలపై ఓవైపు పోరాడుతూనే మరో దిక్కు వాళ్లు నివసించే ప్రాంతాలల్ల గుడిసెల పోరాటం చేసిన. రెండూ ఏకకాలంల జరిగేవి.
ఫ్యాక్టరీ పెడ్తనని చాలెంజ్ చేసిన
సనత్ నగర్ ఏరియాల ఉన్న లక్ష్మీ గ్లాస్ ఫ్యాక్టరీ, బిర్లాకు చెందిన ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీతో పాటు కృషి ఇండస్ట్రీస్ ల యూనియన్ ను స్థాపించిన. బాలానగర్ ఏరియాల ఉన్న శ్రీరాం ఇండస్ట్రీ (ఉషా కంపెనీ)ల యూనియన్ ను నిర్మించడానికి మస్తు తక్లిఫ్ అయింది. అపొజిషన్ యూనియన్ తో కలిసి మేనేజ్‌మెంట్ అడ్డుపుల్లలు వేసింది. కొన్నిసార్లు నాపై భౌతిక దాడులు చేయించింది. ఈ ఆటుపోట్లు అన్నింటినీ తట్టుకుని అక్కడ ఐ.ఎన్.టి.యు.సి.ని ఏర్పాటు చేసిన. హైదరాబాద్ ఆస్బెస్టాస్ కంపెనీల ఓసారి సమ్మె నిర్వహించిన. కార్మికులకు మూడు రూపాయల ఇంక్రిమెంట్ ఇవ్వాలని నేనే స్వయంగా యాజమాన్యంతో మాట్లాడిన. ఆయనో మార్వాడీ సేట్. దాంతో అస్సలు ఒప్పుకోలేదు. పోలీసులను పిలిపించి కార్మికులపై లాఠీఛార్జి చేయించిండు. కార్మికులల్ల స్త్రీలు కూడా ఉండె. వాళ్లను కూడా పోలీసులు మస్తు కొట్టిన్రు. నాకు విషయం తెలిసింది. అప్పుడు నేను ఎంపీగా ఉన్న. దెబ్బలు తిన్న కార్మికులను పరామర్శించిన. వాళ్లను చూసినంక నాకు దుఃఖం ఆగలేదు. వలవలా ఏడ్చిన. మార్వాడీ సేట్ ను కలిసి ఇదేం దారుణమని నిలదీసిన. “మీకు ఫ్యాక్టరీలు పెట్టడం చేతగాదు” అని మార్వాడీసేట్ అన్న మాటతో నాకు రోషమొచ్చింది. “బిడ్డా ఫ్యాక్టరీలు పెట్టడం ఒక్క మార్వాడీలకే చేతవునా? ఎప్పటికైనా నీకు పోటీగా ఆస్బెస్టాస్ కంపెనీ పెడత” అని చాలెంజ్ చేసిన. లైసెన్స్ కూడా తీసుకున్న. రాజకీయాలు, ప్రజాపోరాటాలల్ల బిజీగా మారడంతో నేనా ఫ్యాక్టరీ పెట్టలేకపోయిన. కానీ ఆ లోటును నా రెండో కొడుకు వివేక్ తీర్చిండు.
ఇందిరకు నా ఇంటిని ఇచ్చిన
ఒకవైపు 1977 ఎన్నికలల్ల ఓటమి, మరోవైపు పార్టీ నుంచి బహిష్కరణతో ఇందిరాగాంధీ ఒంటరయింది. ఆ క్లిష్ట సమయంల నేను ఆమెకు అండగా నిలబడ్డ. దేశం మొత్తం తిరిగిన. ఏఐసీసీ సభ్యులను కలిసి ఇందిరకే మద్దతివ్వాలని కోరిన. చివరికి కాంగ్రెస్ రెండుగా చీలింది. ఒకటి కాంగ్రెస్(ఐ- ఇండికేట్) అయితే ఇంకోటి కాంగ్రెస్ (ఎస్ -సిండికేట్).
కాంగ్రెస్(ఐ) వర్కింగ్ కమిటీలోకి ఇందిరాగాంధీ నన్ను అప్పుడే తీసుకుంది. “లీడర్లయితే వస్తున్నరు. జాయిన్ అవుతున్నరు. కానీ పార్టీ ఆఫీసు గురించి ఎవరూ మాట్లాడడం లేదు” అని పార్టీ తొలి వర్కింగ్ కమిటీ సమావేశంల ఇందిర బాధపడింది. ఆ మీటింగ్ కాంగనే నేను ఇందిరను కలిసి ‘‘పదమ్మా’’ అన్న. దానికామె ‘‘ఎక్కడికి?’’ అంది. “నా ఇంటికే తల్లి” అన్న. దాంతో ఇందిర ఇంకేం మాట్లాడకుండ అక్బర్ రోడ్డుల నేనుండే 24వ నంబర్ ఇంటికొచ్చింది. “ఆఫీసు లేదని బాధపడుతున్నవ్ కదమ్మా. ఇంగ నా ఇల్లు తీసుకో” అన్న. నేను మినిస్టర్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వం నాకు ఇచ్చిన క్వార్టర్ అది. అంత పెద్దింట్ల నేను ఒక్కన్నే ఉండేది. అప్పుడు నా భార్య, పిల్లలు అందరు హైదరాబాద్‌లనే ఉన్నరు. అదే ఇంట్ల వెనక చిన్న రూం ఉంటే నేను దాంట్ల ఉన్న. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రధాన
కార్యాలయం ఆ ఇల్లే.
జనం మెచ్చిన దళిత నాయకుడు మన గడ్డం వెంకటస్వామి. అందరూ ముద్దుగా కాకాగా అని పిలుచుకునే వెంకటస్వామి ఓ పోరాట యోధుడు, రాజకీయ దురంధరుడు. పేదలు, కార్మికుల పక్షాన పోరాటం చేసిన ఆయన గుడిసెల వెంకటస్వామిగా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
వర్కర్ లీడర్
హైదరాబాద్‌లో గడ్డం మల్లయ్య, గడ్డం పెంటమ్మ దంపతులకు 1929 అక్టోబర్ 5న మూడో సంతానంగా వెంకటస్వామి జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు గడ్డం వెంకటస్వామి అయితే గూడు లేని వారి తరపున పోరాటం చేసి గుడిసెల వెంకటస్వామి అనిపించుకున్నారు. ఇప్పటికీ చాలా మంది గుడిసెల అనేది ఆయన ఇంటి పేరని అనుకుంటారంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్‌లోని మొగల్పురా బడిలో ఉర్దూ మీడియంలో మెట్రిక్ వరకు చదివారు. ఆ తర్వాత తండ్రి మల్లయ్య మరణించడంతో కుటుంబ పోషణ బాధ్యత వెంకటస్వామిపై పడింది. అలా చార్మినార్ పరిధిలో భవన నిర్మాణ కార్మికునిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఒకానొక సందర్భంలో హైదరాబాద్ వచ్చిన స్వామీ రామానందతీర్థను కలిసిన వెంకటస్వామి.. ఆయన శిష్యునిగా మారి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటంలో భాగస్వాములయ్యారు. జైలుకు కూడా వెళ్లారు. హైదరాబాద్‌కు వచ్చి గూడు లేక అవస్థలు పడుతున్న వారి పరిస్థితులకు చలించిపోయిన వెంకటస్వామి 1949లో ఆలిండియా హట్స్ అసోసియేషన్ స్థాపించారు. దాని ద్వారా సుమారు 80 వేల మందికి ఇండ్ల స్థలాలు ఇప్పించి గుడిసెల వెంకటస్వామిగా జాతీయ స్థాయిలో పేరు సాధించారు.
కార్మిక నాయకుడిగా గుర్తింపు
బషీర్‌బాగ్‌లోని పేదల గుడిసెలను తొలగించేందుకు అప్పటి మున్సిపల్ అధికారులు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిని కూడా ఎదిరించారు. భవన నిర్మాణ కార్మికులకు, రిక్షా కార్మికులకు నాయకత్వం వహించి మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1957లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1961లో ఐఎన్ టీయూసీ కార్మిక సంఘం అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. దేశంలో వివిధ కార్మిక చట్టాలు రూపుదిద్దుకునేందుకు తన వంతు సాయం అందించారు. 1967లో సిద్దిపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు.
పెన్షన్ ఫండ్ తెచ్చిన్రు
కార్మికుల జీవితాలకు భద్రత కల్పించే దిశగా పెన్షన్ ఫండ్ ఏర్పాటు చేసిన కార్మిక పక్షపాతి. పేదల కోసం అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేయించారు. పేదల కోసం పౌర సరఫరాల వ్యవస్థను ఏర్పాటు చేయించారు. పేదల కోసం పనిచేసే కేంద్రమంత్రిగా, ముక్కుసూటి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రామగుండం పునరుద్ధరణ కోసం కాకా వెంకట స్వామి జీవితాంతం పోరాడారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు, తన తర్వాత కుమారుడు వివేక్ ఎంపీ అయ్యాక ఆ సంస్థకున్న రూ.పది వేల కోట్ల బాకీలను కేంద్రంతో మాట్లాడి మాఫీ చేయించిన ఘనత ఆయనది. ఆయన వారసులది.
అంబేద్కర్ అడుగుజాడల్లో..
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను కాకా జీవితాంతం పాటించారు. ఆయన పేరుతోనే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి ఉన్నత ప్రమాణాలతో బడుగు బలహీన వర్గాల పిల్లలకు చదువు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు కూడా కాకా అడుగుజాడల్లో నడుస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతూ, సామాజిక కార్యక్రమాలు చేపడుతూ పేదల అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తున్నారు. మాల కులంలో వెంకట స్వామి పుట్టినందుకు గర్వపడుతున్నాం. జోహార్ కాకా వెంకట స్వామి.. జోహార్!!
తెలంగాణ బిడ్డ
నిజాం వ్యతిరేక ఉద్యమాలతో మొదలైన కాకా వెంకటస్వామి జీవితం ప్రత్యేక తెలంగాణ సాధన వరకూ అలానే సాగింది. ఆయన కన్నుమూసే వరకూ పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ గానే బతికారు. ప్రజా సమస్యల పట్ల ఎంతో అవగాహన ఉండి నిత్యం పేద ప్రజల కోసం తపనపడే జీవితం ఆయనది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగిన కాకా శ్రమ జీవుల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూ వందకు పైగా కార్మిక సంఘాలకు అధ్యక్షుడిగా పని చేశారు.రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్ని పదవుల్లో ఉన్నా.. శ్రామిక, కార్మిక, బడుగు జీవుల పక్షానే ఆయన పోరాటం కొనసాగింది.
తెలంగాణ కోసం వెంకటస్వామి ఎంతో పోరాటం చేశారు. సీనియర్ నాయకునిగా ఉండి, పదవి పోతుందని తెలిసినా ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీ అధినాయకురాలి ముందు గొంతెత్తిన తెలంగాణ ముద్దుబిడ్డ కాకా. 1969లో తెలంగాణ కోసం జైలుకు వెళ్లి ఆ తదుపరి పోలీసు కాల్పులకు కూడా ఎదురు నిలిచారు. మలితరం ఉద్యమం సమయంలో కేసీఆర్ మంచిగ పోరాటం చేస్తున్నారని ఆయనకు అండగా నిలిచారు. ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందించారు. తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో ముందువరుసలో ఉండి, తెలంగాణ ఆవశ్యకత గురించి పాలకులకు చెప్పి ఒప్పించేందుకు కృషి చేసిన కాకా.. తన చిరకాల స్వప్నం తెలంగాణ సాకారమైన తర్వాత 2014 డిసెంబర్ 22న తుదిశ్వాస విడిచారు.
సింగరేణితో విడదీయరాని అనుబంధం
సింగరేణి బొగ్గుగని కార్మికులతో కాకాకు విడదీయలేని అనుబంధం ఉండేది. 1990 దశకంలో దాదాపు ఖాయిలా పడ్డ సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సంస్థకు రూ.1,100 కోట్లు అప్పుగా ఇప్పించి, మళ్లీ లాభాల బాటపట్టించడంలో కార్మికులతో కలిసి కాకా చేసిన కృషిని మర్చిపోలేం. కాకా గనుక సింగరేణికి అండదండగా నిలబడకుంటే ఇప్పటి రోజు సంస్థ నిలదొక్కుకోవడం కష్టంగా ఉండేదంటే అతిశయోక్తి కాదు. కార్మికులకు 1998 నుంచి అమలులోకి వచ్చిన పెన్షన్ స్కీం విషయంలోనూ కాకా పాత్ర గణనీయంగా ఉంది. సింగరేణి కార్మికుల సమస్యలపై, బొగ్గు గని కార్మిక వేతన ఒప్పందాల కోసం సుదీర్ఘ సమ్మెలు జరిగిన సందర్భాల్లోనూ కాకా జోక్యం చేసుకొని కేంద్రంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి సాయపడ్డారు. కొత్తగా బొగ్గు గనుల తవ్వకానికి అనుమతులు ఇప్పించడంలోనూ కాకా చొరవ చూపారు.
కోల్ బెల్ట్ లో పేదసాదలకు సాయం
కోల్ బెల్ట్ లో చావైనా, పెళ్లయినా ఇంటికి వెళ్లి వారికి సహాయం అందించే దాతృత్వ గుణం ఆయనది. ఇదే గుణం ఆయన కుమారులకు కూడా వచ్చింది. ఆనవాయితీగా వారు కోల్ బెల్ట్ ప్రాంతంలో ఈ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. కోల్ బెల్ట్ లో కులమతాలకు అతీతంగా పేదసాదల ఇంటికి వెళ్లి భోజనం చేసే అలవాటు కూడా ఆయనకు ఉంది. కోల్ బెల్ట్ లోని ఉద్యమకారులను, పార్టీ కార్యకర్తలను, నాయకులను, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారిని సైతం 90 శాతం ఆయన పేరు పెట్టి పిలిచేవారు. కోల్ బెల్ట్ లో పెద్దమనుషులు, ఆయన మనుమండ్ల వయసున్న వారు సైతం వెంకటస్వామిని ఆప్యాయంగా కాకా అనే పిలిచేవారు. రాజకీయాలకు కార్మిక సంఘాలకు అతీతంగా కాకాతో కోల్ బెల్ట్ ప్రాంతంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉండేవి. కోల్ బెల్ట్ ప్రాంతంలో జరిగిన బొగ్గుగని కార్మికుల పోరాటాలకు ఆయన అండదండలు, అభివృద్ధి, సంక్షేమం కోసం కాకా చేసిన కృషి ఎప్పటికీ మరువలేనివి.
ఓడినా ప్రజలకు దగ్గరగానే..
కాకా పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమిపాలైన సందర్భాల్లో బాధపడేవారు కాదు. ప్రజల తీర్పును శిరస్సు వంచి అంగీకరించేవారు. అలాగని ఓడితే ప్రజలకు దూరమయ్యే వారు కాదు. ఆయన గెలిచినప్పుడు నియోజకవర్గంలో ఎన్ని పర్యటనలు చేశారో ఓటమి తర్వాత అంతకన్నా ఎక్కువ పర్యటనలు చేసిన సందర్భాలున్నాయి. ప్రతి ఒక్కరితో ఆయన ఫోన్లో టచ్ లో ఉండేవారు.
బోగస్ ఎన్ కౌంటర్లపై గళం
కోల్ బెల్ట్ ప్రాంతంలో రాత్రికి రాత్రి యువకులను, కార్మికులను నక్సల్స్ తో సంబంధాలున్నాయనే నెపంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కిడ్నాప్ లు చేసినప్పుడు కాకా జోక్యం చేసుకునేవారు. కోల్ బెల్ట్ ప్రాంతంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడారు.బోగస్ ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా కాకా గొంత్తెత్తేవారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో సైతం ప్రభుత్వం జరిపిన బోగస్ ఎన్ కౌంటర్లను ఖండించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రముఖ పౌరహక్కుల సంఘం నాయకుడు, న్యాయవాది కన్నాభిరాన్ తదితరులతో కలిసి నక్సలైట్ల సమస్య పరిష్కారానికి, ఎన్ కౌంటర్ల నిలిపివేతకు కాకా చర్చలు కూడా జరిపారు. కన్నాభిరాన్ సహా పలువురు ప్రముఖులు మారేడుపల్లిలోని కాకా ఇంట్లో ఈ విషయంపై చర్చించారు. ముఖ్యమంత్రితో తన ఇంటి నుంచే కాకా ఆ సందర్భంలో ఎన్ కౌంటర్లను నిలిపివేయాలని, అరెస్టులను కూడా ఆపాలని ఫోన్ లో నాయకుల ముందు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి.
నేటి తరాలకు ఆదర్శం
రాజకీయాల్లో జాతీయస్థాయిలో అవినీతి మచ్చపడని నాయకుడిగా కాకాకు పేరుంది. కాకా అడుగుజాడలు, ఆయన కుటుంబ సభ్యులకే కాకుండా ఎందరికో ఈ రోజు వరకు ఆదర్శంగా చెప్పవచ్చు. ఎన్ని కష్టాలొచ్చినా ఎన్నో రాజకీయ ఒడిదొడుకులను చవి చూసినా ప్రజల పక్షాన పోరాటమన్న పంథాను ఆయన ఎప్పుడూ వదల్లేదు. ప్రస్తుతం అధికారం కోసం నానా గడ్డి కరిచే నేతలకు కాకా జీవితం ఒక గుణపాఠం లాంటిది. ఎంతో ఆదర్శవంతమైన ఆయన జీవితం, ఆయన వేసిన బాట, అడుగు జాడలు భవిష్యత్తు తరాలకు పాఠం లాంటివంటే అతిశయోక్తి కాదు. కాకా గూర్చి ఎంత రాసినా, ఎంత చెప్పినా ఒడవని జీవితం ఆయనది. నాయకుడంటే కాకాలా ఉండాలి. నేతా హోతో ఐసా.. కాకా వెంకటస్వామి జైసా.. కాకా అమర్ రహే.. కాకాకి యాద్ బరార్ రహే.
నేడు కేంద్ర మాజీ మంత్రి, కార్మిక నేత గడ్డం వెంకటస్వామి వర్ధంతి
- వెలుగు ఓపెన్ పేజ్
- December 22, 2020
లేటెస్ట్
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్‌కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?