బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని నూతన కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్‌కు కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి పేరును ఖరారు చేశారు. ఆదివారం సాయంత్రం మున్సిపల్ ఆఫీస్ లో చైర్ పర్సన్ జక్కుల శ్వేత అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సమావేశంలో కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. చీఫ్ గెస్టులుగా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బెల్లంపల్లి పట్టణ డెవలప్మెంట్కు అంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్‌కు తన తండ్రి పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. పట్టణంలో డంపింగ్ యార్డుతో పాటు పలు డెవలప్ మెంట్, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు కృషి చేయాలని కలెక్టర్‌ను కోరారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ పేరు కోసం 3 ప్రతిపాదనలు వచ్చాయని.. కౌన్సిల్ సభ్యులు కాకా వెంకటస్వామి పేరును ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చెప్పారు.
పోరాటాల గడ్డ బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్‌కు కార్మికుల పక్షపాతి అయిన కాకా వెంకటస్వామి పేరును పెట్టడం సముచితమేనన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పి.హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.