అవకాశం ఇస్తే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ సాకారం చేస్తాం : ప్రకాశ్ జవదేకర్

వన్ నేషన్– వన్ రేషన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానమని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మూడేళ్లుగా 80 కోట్ల కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో నరేంద్ర మోడీ ప్రభుత్వమే రేషన్ బియ్యం పంపిణీ చేస్తోందని, కేసీఆర్ ఇవ్వడం లేదన్నారు. మస్కట్ లో కరోనా వ్యాక్సిన్ కోసం ఒక్కొక్కరు రూ.16 వేలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉచితంగా ప్రధాని మోడీ కరోనా వ్యాక్సిన్ అందించారని గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో వివిధ మోర్చాల నేతలతో జరిగిన సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు.

తెలంగాణలో లక్షలాది మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.6 వేల చొప్పున అందిస్తున్నామని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. తెలంగాణలో 11 లక్షల మందికిపైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 30 లక్షల టాయిలెట్లు కట్టించామని, ముద్ర లోన్లు కూడా ఇచ్చామన్నారు. 40 లక్షల మందికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా అమలవుతోందని వెల్లడించారు. మోడీ ప్రభుత్వ పథకాల వల్ల లబ్ది పొందిన వాళ్లంతా 8919847687 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి బీజేపీకి మద్దతు పలకాలని ప్రకాశ్ జవదేకర్ పిలుపునిచ్చారు. కేంద్రం అందిస్తున్న పథకాలు పొందుతున్న వారంతా ఏ పథకం వల్ల లబ్ది పొందారో వివరిస్తూ ప్రత్యేకంగా వీడియో తీసి.. మంగళవారం (జూన్ 13న) సాయంత్రం వరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు. 

ప్రతీ ఒక్క మోర్చా కార్యకర్త తప్పనిసరిగా మూడు కుటుంబాలను కలిసి లబ్దిదారుల వీడియోలను సేకరించాలని ప్రకాశ్ జవదేకర్ కోరారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతు పలుకుతూ 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. మోడీ 9 ఏళ్ల పాలనను–కేసీఆర్ పాలనను బేరీజు వేయండి అని పిలుపునిచ్చారు. దేశ ప్రజలను ప్రధాని మోడీ కుటుంబ సభ్యులుగా భావిస్తారని చెప్పారు. కేసీఆర్ మాత్రం తన కుటుంబమే పరివారంగా భావిస్తారని వ్యాఖ్యానించారు. మోడీ కేబినెట్ లో ఏ ఒక్క మంత్రిపైనా అవినీతి మచ్చలేదన్నారు. కేసీఆర్ కేబినెట్ లో మాత్రం అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ఉన్నారని ఆరోపించారు.

ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్ అమలు చేయలేదని ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ఈ విషయాలను ఒక్కో మోర్చా కార్యకర్త ప్రతిరోజు మూడు ఇండ్లకు వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో తెలంగాణలో 14 ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నీళ్లు, -నిధులు, -నియామకాల నినాదానికి కేసీఆర్ నీళ్లొదిలారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇస్తే ‘‘నీళ్లు, -నిధులు, -నియామకాలు’’ అనే నినాదాన్ని సాకారం చేసి తీరుతామన్నారు.