ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

సత్తుపల్లి, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సత్తుపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి తెలిపారు. సోమవారం సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా గర్జన సభకు ఆమె హాజరు కాగా, కార్యకర్తలు బైక్​ ర్యాలీతో స్వాగతం పలికారు. వెంగళరావునగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి ట్రాక్టర్ నడుపుతూ సిద్దారం రోడ్డులోని సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతకు ఉపాధి చూపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని, నేటి టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు అసమర్థ పాలనకు చిరునామాగా మారాయని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి బాధితుల పక్షాన పోరాడుతున్న నాయకులు, మహిళలపై చేయి చేసుకుంటే సహించేది లేదని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని హెచ్చరించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్, నున్న రామకృష్ణ, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, మననుకొండ రాధాకృష్ణ, రామిశెట్టి సుబ్బారావు,లక్కినేని సురేంద్ర, కట్ల రంగారావు, సూరంపల్లి రామారావు, జ్యేష్ట సత్యనారాయణ, పైడిపల్లి కిశోర్, నాగళ్ల దీపక్ చౌదరి, ముక్తాల సురేష్ రెడ్డి, రావి నాగేశ్వరరావు, గాదె చెన్నారవు, రామ్మూర్తి నాయక్, జోష్ణ సింగ్, గోవర్ధన్, డాక్టర్ శంకర్ నాయక్  పాల్గొన్నారు.

కలెక్టర్​ స్పందించకపోవడం సరైంది కాదు
ఖమ్మం టౌన్: రఘునాథపాలెం మండలం కోయచలకలోని సర్వే నెంబర్ 192/1లోని ప్రభుత్వ భూమిలో రూ.150 కోట్ల మట్టి అక్రమ రవాణా జరిగినా కలెక్టర్​ స్పందించకపోవడంపై కేంద్ర మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సమాచార హక్కు చట్టం కార్యకర్త కోయిని వెంకన్నతో కలిసి ఆక్రమిత స్థలాన్ని సందర్శించారు. మట్టి అక్రమ రవాణా చేసిన తీరు, లోకాయుక్త వేసిన రూ.16 వందల కోట్ల జరిమానా తదితర అంశాలపై ఆమె ఆరాతీశారు. ఆమె వెంట రాధ కిశోర్, దీపక్ చౌదరి, మిక్కిలినేని నరేంద్ర, మందా బుచ్చిబాబు, మాధవిరెడ్డి పాల్గొన్నారు.

కలెక్టరేట్​ ఎదుట వరద బాధితుల నిరసన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వరద సాయం ఇయ్యకపోతే సీఎం కేసీఆర్​తో పాటు మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ ఇంటిని ముట్టడిస్తామని గోదావరి వరద బాధితులు హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్​ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలంలోని సుభాష్​నగర్​ ప్రాంతంలో మంత్రితో పాటు కలెక్టర్​ అనుదీప్​ వరదను పరిశీలించారని చెప్పారు. అయినా తమకు పరిహారం ఇవ్వలేదని వాపోయారు. తహసీల్దార్​ను అడిగితే  టైం అయిపోయిందని చెబుతున్నారని బాధితులు కంచర్ల కోటేశ్వరి, బెల్లంకొండ కుసుమ, రాజేశ్, సాయిలక్ష్మి వాపోయారు. అలాగే అశ్వాపురం మండలం నెల్లిపాక, నెల్లిపాక బంజర ప్రాంతాలకు చెందిన వరద బాధితులు వేర్వేరుగా కలెక్టరేట్​ ఎదుట ఆందోళన చేశారు. పోలవరం ముంపు ప్రాంతంగా నెల్లిపాక పంచాయతీని ప్రకటించాలని డిమాండ్​ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ సీపీఐఎంఎల్​ ప్రజాపంథా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ ఎల్​హెచ్​పీఎస్​ నాయకులు నిరసన తెలిపారు. 


బూర్గంపహాడ్ బంద్ ప్రశాంతం

బూర్గంపహాడ్,వెలుగు: మండలంలోని గోదావరి ముంపు గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా ప్రకటించి పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం మండల బంద్  నిర్వహించారు. బూర్గంపహాడ్, సారపాక, లక్ష్మీపురం గ్రామాలతో పాటు రెడ్డిపాలెం, మోరంపల్లి బంజర్ గ్రామాల్లో వ్యాపారస్తులు తమ షాపులను స్వచ్ఛందంగా మూసి వేసి బంద్ లో పాల్గొన్నారు. జేఏసీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలను మూసి వేయించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గోదావరి వరదలతో ముంపు గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయని, పోలవరం నిర్మాణంతోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరికి వరదలు వచ్చాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ముంపు గ్రామాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు కేసుపాక వెంకటరమణ, దామెర శ్రీను, దాసరి సాంబ, చిప్పా రాజు, జక్కం సుబ్రహ్మణ్యం, చుక్కపల్లి బాలాజి, మువ్వా వెంకటేశ్వర్లు, పోలపల్లి సుధాకర్ రెడ్డి, బర్ల నాగమణి, తాళ్లూరి జగదీశ్, బత్తుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఆక్రమణలపై కలెక్టర్ స్పందించాలి
ఖమ్మం టౌన్, వెలుగు: రఘునాథపాలెం మండలం కోయచలకలోని సర్వే నెంబర్ 192/1లోని ప్రభుత్వ భూమిలో రూ.150 కోట్ల మట్టి అక్రమ రవాణా జరిగినా కలెక్టర్​ స్పందించకపోవడంపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సమాచార హక్కు చట్టం కార్యకర్త కోయిని వెంకన్నతో కలిసి ఆక్రమిత స్థలాన్ని సందర్శించారు. మట్టి అక్రమ రవాణా చేసిన తీరు, లోకాయుక్త వేసిన రూ.16 వందల కోట్ల జరిమానా తదితర అంశాలపై ఆమె ఆరాతీశారు. ఆమె వెంట రాధ కిశోర్, దీపక్ చౌదరి, మిక్కిలినేని నరేంద్ర, మందా బుచ్చిబాబు, మాధవిరెడ్డి పాల్గొన్నారు.

విశ్వ నేతగా ప్రధాని మోడీకి గుర్తింపు

 బీజేపీ తమిళనాడు కో ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్​ రెడ్డి
ఖమ్మం, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్​ 17న భద్రాచలంలోని గోదావరి తీరంలో భారీ యాగం నిర్వహించనున్నట్లు బీజేపీ కోర్​ కమిటీ సభ్యుడు, తమిళనాడు కో ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్​ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల అంతర్జాతీయంగా నిర్వహించిన సర్వేలో 75 శాతం ఓట్లతో అత్యంత ప్రభావవంతమైన నేతగా మోడీ నిలిచారని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్​ ఐదో స్థానంలో నిలిస్తే, సర్వేలో మొదటి స్థానంలో నిలిచిన మోడీ విశ్వనేతగా గుర్తింపు పొందారని తెలిపారు. దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి వైపు నడిపిస్తున్న ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా గిరినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించే యాగం కోసం తమిళనాడు నుంచి రైలు ద్వారా 1100 మంది హాజరు కానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అరాచక పాలన చేస్తున్నారని ఆరోపించారు. మద్యం స్కామ్, ప్రాజెక్టుల్లో స్కామ్ ఇలా అన్నిరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్కామ్​లు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రుణమాఫీ చేయకుండా ఇతర రాష్ట్రాల నుంచి రైతులను తీసుకు వచ్చి రెండ్రోజుల పాటు వాళ్లకు వీడియోలు చూపెట్టి మభ్యపెట్టడం దారుణమన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్​దేనని అన్నారు. అన్ని పంటలకు మద్దతు ధరలు పెంచి, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్రంపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. బీజేపీ కార్పొరేటర్​ డి సత్యనారాయణ ఉన్నారు. 


పెన్షన్​ పత్రాలను అందించిన మంత్రి
ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: ఆసరా పెన్షన్​ మంజూరు పత్రాలను మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. శాంతినగర్​లోని ఏఎస్ఆర్​ జూనియర్​ కాలేజీ, వర్తక సంఘ భవన్, గట్టయ్య సెంటర్​లోని ఫ్రీడం పార్క్​లలో వివిధ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కలెక్టర్​ వీపీ గౌతమ్, మేయర్​ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్ధ కమిషనర్​ ఆదర్శ్​ సురభి, కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్య, రుద్రగాని శ్రీదేవి, కమర్తపు మురళి ఉన్నారు.

డీసీసీ అధ్యక్షుడిపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
ఇల్లందు, వెలుగు: కోట్ల ఆఫర్  వచ్చినా పార్టీ కోసం పని చేస్తున్న భద్రాచలం ఎమ్మెల్యే,  డీసీసీ అధ్యక్షుడు పోదెం వీరయ్యపై రాంచందర్​నాయక్​ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్  పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు దొడ్డా డానియోలు, పులి సైదులు డిమాండ్​ చేశారు. ఇందిరాభవన్ లో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినా, ఎమ్మెల్యే పొదెం వీరయ్య కాంగ్రెస్​లోనే కొనసాగుతున్నారని అన్నారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. చీమల వెంకటేశ్వర్లు, జాఫర్  పాల్గొన్నారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
చండ్రుగొండ,వెలుగు: చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు సూచించారు. సోమావారం జడ్పీ హైస్కూల్ లో జాతీయ క్రీడా దినోత్పవాన్ని నిర్వహించారు. పలు క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందచేశారు. ఎంఈవో సత్యనారాయణ, హెచ్ఎం ఆనంద్ కుమార్, పీడీ రామారావు, టీచర్లు పాల్గొన్నారు.

కానిస్టేబుల్​ కుటుంబానికి ఆర్థికసాయం
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఇటీవల మరణించిన కానిస్టేబుల్​ కుటుంబానికి తోటి ఉద్యోగులు రూ.2.50 లక్షల ఆర్థికసాయం అందించారు. కానిస్టేబుల్​ షేక్​ సుభాన్​ ఆనారోగ్యంతో మృతి చెందగా, అతని బ్యాచ్​ కానిస్టేబుళ్లు తలా కొంత జమ చేసి ఈ మొత్తాన్ని ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేసి చెక్కును మృతుడి కుటుంబానికి అందించారు. ఖానాపురం హవేలీ సీఐ రామకృష్ణ, టాస్క్​ఫోర్స్​ ఇన్స్​పెక్టర్​ సత్యనారాయణ, కానిస్టేబుళ్లు సర్వర్​ఖాన్, రామయ్య, మల్లేశ్, గజేంద్ర, నారాయణమూర్తి, శ్రీనివాసరావు, రామచందర్​ పాల్గొన్నారు. 

ఐటీడీఏ పీవోకు ఆదివాసీ జేఏసీ వినతి
భద్రాచలం, వెలుగు: ఆదివాసీ జేఏసీ నేతలు సోమవారం భద్రాచలంలో ఐటీడీఏ పీవో గౌతమ్​ పోట్రును కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్డీసీ కోర్టులో తప్పుడు జడ్జిమెంట్లను తిరిగి విచారణ చేపట్టాలని కోరారు. కోర్టు సిబ్బంది 1/70 చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని వెంటనే తొలగించి తప్పుడు జడ్జిమెంట్లను పరిశీలించి ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరారు. కురసం రమేశ్, సోయం సత్యనారాయణ, శెట్టిపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు.

ఉచితంగా హోమ ద్రవ్యాలు​ 
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆర్కే చారిటబుల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో వినాయక మండపాలకు ఉచితంగా హోమ ద్రవ్యాలను అందిస్తామని ట్రస్ట్​ చైర్మన్​ కేవీ రంగాకిరణ్​ తెలిపారు. చుంచుపల్లి మండలం విద్యానగర్​ కాలనీలోని ట్రస్ట్​ ఆఫీస్​లో సెప్టెంబర్​ 1 నుంచి ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు హోమ ద్రవ్యాలతో పాటు ఆవు నెయ్యి, కాషాయ ధ్వజాలు, పూజా సామాగ్రిని ట్రస్ట్​ తరపున పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.  

చెక్కులు అందజేత
కల్లూరు, వెలుగు: కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ లక్కినేని నీరజ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్​ మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అందజేశారు. తన సొంత ఖర్చులతో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్​ బాబ్జి ప్రసాద్, ఈవో కృష్ణారావు, జడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్, ఎంపీపీ బీరవల్లి రఘు, టీఆర్ఎస్  మండల అధ్యక్షుడు పాలెపు రామారావు 
పాల్గొన్నారు. 

బూస్టర్ డోస్  స్పెషల్  డ్రైవ్
పాల్వంచ, వెలుగు: పట్టణంలో సోమవారం కొవిడ్​ బూస్టర్  డోస్ వ్యాక్సినేషన్​ స్పెషల్ డ్రైవ్  చేపట్టారు. పలువురికి వైద్య సిబ్బంది బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భం గా డీసీఎంఎస్  వైస్  చైర్మన్  కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. హెల్త్ అసిస్టెంట్ పద్మ,  మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్ భీమయ్య , బొందిలి రాంబాబు, గడ్డం రమణయ్య, ఆర్పీ అరుణ, మున్నా పాల్గొన్నారు.