కాలం కన్న బీసీల మహనీయుడు శివశంకర్

కాలం కన్న బీసీల మహనీయుడు శివశంకర్

గాయపడ్డ పేదవాడి జీవితంలో నిద్రలేని రాత్రులు ఎన్నో!  కష్టాల కడలికి ఎదురీది, కన్నీళ్లు దిగమింగుకుని, కారుమబ్బుల్ని సైతం చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా అణచివేత చీకట్లను పాతరేస్తూ.., యావత్ దేశమే గర్వించేలా ఎదిగిన మహనీయుడు, కీర్తిశేషులు జస్టిస్ పుంజాల శివశంకర్.  మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ హైదరాబాద్ శివారులోని మామిడిపల్లి అనే గ్రామంలో 1929 ఆగస్టు 10న జన్మించాడు. సామాజిక న్యాయం ఎజెండాగా, కోర్టుల్లో బలహీనవర్గాల రిజర్వేషన్లు ఎన్నిసార్లు కొట్టేసినా బీసీల స్వాభిమాన జెండాను సమున్నతంగా ఎత్తిపట్టి, దేశవ్యాప్తంగా ఎందరో దళితులు, బీసీలు అధికారులుగా, న్యాయమూర్తులుగా ఎదిగేందుకు దారి చూపిన వేగుచుక్క పుంజాల శివశంకర్.  ఆత్మవిశ్వాసం,  క్రమశిక్షణ, దూరదృష్టి,  దృఢ సంకల్పం ఉంటే  కటిక పేదరికంలో పుట్టినా అత్యంత శిఖరాలను అందుకోవచ్చని నిరూపించిన ఆదర్శమూర్తి జస్టిస్ శివశంకర్.  ఆయన  జ్యోతీరావు ఫూలే, సాహుల వారసత్వాన్ని తెలుగు నేలపై కొనసాగించిన ఆదర్శప్రాయుడు. ఆయన జీవిత-పోరాటం ఈ నవతరానికి ఎంతో ఆదర్శం.

పోరాట పటిమతో ఉన్నతస్థాయికి..

శివశంకర్ జీవితంలో జరిగిన దుఃఖకరమైన, హృదయవిదారక ఘటనలు ఏ నాయకుడుకి జరగకపోవచ్చు. అయినా కానీ పోరాట పటిమతో ఉన్నతస్థితికి చేరుకున్నారు. ఈ క్రమంలో అవమానాలు భరించలేక ఎన్నో సౌకర్యాలు ఉండే న్యాయమూర్తి పదవికి 11 నెలల్లోనే రాజీనామా చేశారంటే ఆయన ఆత్మవిశ్వాసాన్ని, అణచివేతను ఏమాత్రం సహించని తెగింపును అందరం మెచ్చుకోవాలి. ఆయన జీవితాన్ని ఒక సినిమాగా తీస్తే,  దునియాలో ఉన్న ఏ అవార్డు అయినా వెతుక్కుంటూ  వస్తుందని అంటాడు కంచె ఐలయ్య.  ఎందుకంటే ఓ సామాన్యుడి జీవితంలో ఎన్ని మలుపులు ఉంటాయో, అంతకన్నా ఎక్కువే శివశంకర్​ జీవితంలో ఉన్నాయి. భిన్న కోణాలు ఆయనలో దర్శనమిస్తాయి.  పుంజాల శివశంకర్ మున్నూరు కాపు సామాజిక వర్గంలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. ఇంటి నుంచి చిన్నతనంలోనే అన్నతో పాటు వెళ్లిపోయి అమృత్​సర్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం మీద కాలం వెళ్లదీసి, చెప్పులు కుట్టి, ఆకలితో అలమటించి తోడపుట్టిన అన్నయ్య జగన్ చనిపోయినా చదువును మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన అనుభవించిన కష్టాలు మరే నాయకుడు అనుభవించలేదంటే అతిశయోక్తి కాదు. తాను ఎక్కవలసిన మెట్లను తానే నిర్మించుకొని, ఒక్కొక్కటిగా ఎక్కి ఉన్నత శిఖరాలు అధిరోహించాడు.

ఇందిరాగాంధీకి బాసటగా శివశంకర్​

శివశంకర్ తన జీవితంలో పేదరికాన్ని,  ఉన్నత స్థితిని చవిచూశారు. గంజి,  బెంజీ రెండూ ఆయనకు తెలుసు. మాములు స్థాయి నుంచి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం ఆయనకే  చెల్లింది. ఎమర్జెన్సీ తరువాత ఇందిరా గాంధీని అనేక కేసులు చుట్టుముట్టాయి. అప్పటికే పేరుమోసిన న్యాయవాదులంతా ఉన్నా, ఇందిరాగాంధీ శివశంకర్ సాయం కోరారు. మాజీ ప్రధానమంత్రికి కుడి భుజంలా ఉండి కేసులన్నిటినీ పూర్తిచేసి, మళ్లీ ఇందిరా గాంధీని తిరుగులేని శక్తిగా నిలబడేందుకు ఇతోధికంగా దోహదం చేశారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు లాంటి పెద్ద వ్యక్తులు సాయం కోరి వచ్చినా అదేవిధంగా నిరుపేదవాళ్లు సాయానికి వచ్చినా అండగా ఉన్నాడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెళ్లికి పుంజాల శివశంకరే పెద్దమనిషిగా వ్యవహరించారు. కాగా, పాలకుల నిర్లక్ష్యంతో విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో బీసీల వాటా క్రమేణా గణనీయంగా తగ్గిపోతోంది. వెనుకబడిన వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం దారుణంగా తగ్గిపోతుంది. పుంజాల శివశంకర్​ బతికి ఉన్నంతకాలం  బడుగుజీవుల కోసమే  పోరాటం చేశారు.  బీసీల భావజాలంతో ఆయన చూపెట్టిన మార్గంలో పాలకులు పయనించాలి. బీసీ అధికార లక్ష్య సాధన దిశగా నేతలు కృషి చేసినపుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి.

బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం

ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ మహనీయుడు విద్య, ఉద్యోగం, రాజకీయరంగాల్లో రిజర్వేషన్లను అందించి వాటిని రాజ్యాంగబద్ధం చేశారు. కానీ,  సమాజంలోని బలహీన వర్గాలకు రిజర్వేషన్లే వాళ్ల ఎదుగుదలకు బలం అవుతాయని తెలుగు రాష్ట్రాల్లో సామాజికంగా  వెనుకబడిన కులాలను సమగ్రంగా అధ్యయనం చేసి,  రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడో, ఎన్ని నిద్రలేని రాత్రుళ్లు గడిపాడో ఆయనకే తెలుసు!  అప్పటికే  తను పేరుమోసిన న్యాయవాది. ఆర్థికంగా వెనుకుబాటుకు గురై సమాజంలో వెనుకబడిన బీసీల రిజర్వేషన్ల సాధన కోసం అలుపు లేకుండా చిత్తశుద్ధితో పోరాటం చేశాడు. బూర్గుల నుంచి కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రుల వరకు నోటిదాక వచ్చినట్టే వచ్చిన రిజర్వేషన్లు కోర్టుల్లో కొట్టివెయ్యబడ్డాయి. ఇక బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్ల జోలికి పోదల్చుకోలేదు. అప్పటికే ప్రభుత్వానికి న్యాయ సలహాదారుగా ఉన్న పుంజాల, సర్కారు సుప్రీంకోర్టులో కేసు వెయ్యకపోతే...న్యాయ సలహాదారు పదవికి రాజీనామా చేసి, స్వయంగా తనే కేసు వేసి వాదిస్తానని చెప్పారు. శివశంకర్ పట్టుదల చూసిన ప్రభుత్వం బీసీల తరఫున దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేసు వేస్తే...శివశంకర్ వాదనతో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించింది. బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని సమర్థించింది. ఇప్పుడు విద్య, ఉద్యోగ రంగాల్లో అమలు అవుతున్న రిజర్వేషన్లు ఆయన పుణ్యమే. 

- మిడివెళ్లి సంతోష్, 
సీనియర్ జర్నలిస్ట్