పేదలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలి : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

పేదలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలి : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

అహ్మదాబాద్: శక్తిమంతమైన భారత్ నిర్మాణంలో విద్యే కీలకమని..పేదలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన గుజరాత్ యూనివర్సిటీ 73వ స్నాతకోత్సవ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.." యువత భుజాలపైనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుంది. దేశ భవిష్యత్తుతోనే యువత భవిష్యత్తు ముడిపడి ఉంది. మంచి భవిష్యత్తును నిర్మించుకున్న తర్వాత, తమను ఇంతటి వారిని చేసిన సమాజానికి తిరిగి ఇవ్వటం యువత అలవాటు చేసుకోవాలి. దేశ జనాభాలో 50 శాతం మంది 30 ఏండ్లలోపు వారే. ఇదే మన బలం. 

ఎక్కువమంది మానవ వనరులతో ప్రపంచానికి మన దేశం ప్రతిభావంతుల కర్మాగారం కాబోతోంది. యువత ప్రతిభను, శక్తిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోగలిగితే భారత్ త్వరలోనే మరింత శక్తిమంతమైన దేశంగా అవతరిస్తుంది. పేదలకు, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్యను వారు భరించగలిగే రుసుములకే అందించాలి. రోజువారీ జీవితంలో యోగ, వ్యాయామాలను భాగం చేసుకోవాలి.ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లను వదిలి భారతీయ సంప్రదాయ వంటకాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి" అని స్టూడెంట్లకు వెంకయ్యనాయుడు సూచించారు. కార్యక్రమంలో గుజరాత్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నీరజ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.