- విభేదాలు వీడి జమిలి ఎన్నికలకు
- పార్టీలు ముందుకు రావాలి: వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ, వెలుగు: దేశ ప్రజలందరికీ ఒకే న్యాయం, ఒకే చట్టం ఉండాలని... అది ఉమ్మడి పౌరస్మృతితోనే సాధ్యమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి పౌరస్మృతితోనే జాతీయ ఐక్యత, సమగ్రత బలోపేతం అవుతుందని, అయితే దీనిపై మీడియా, రాజకీయ పార్టీలు, బ్యూరోక్రసీ, ప్రజల్లో విస్తృత చర్చ జరగాలన్నారు. ఏదైనా చట్టం చేసే సమయంలో భిన్నాభిప్రాయాలు సహజంగా ఉంటాయని, అయితే సంప్రదింపులు, చర్చల తర్వాత తీసుకునే నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో మీడియాతో వెంకయ్య చిట్ చాట్ నిర్వహించారు. అందరికీ ఉమ్మడి చట్టం రావాలని, మతం అనే సిద్ధాంతం ఉండకూడదన్నారు.
ఒక్కో మతం పేరుతో ఒక్కో న్యాయం జరిగితే అది మంచిది కాదని చెప్పారు. జాతీయ ఐక్యతను బలోపేతం చేయడానికి దోహదపడే ఉమ్మడి పౌరస్మృతిపై ఏకాభిప్రాయాన్ని తీసుకురావడానికి మత పండితులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ముస్లిం పేరు ఉన్నంత మాత్రాన వారిని మొత్తం ముస్లింలకు ప్రతినిధిగా పరిగణించలేమని చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ యావత్ ముస్లిం సమాజానికి ప్రతినిధి కాదన్నారు. నిజమైన కమ్యూనిటీ నేతలతో సంప్రదింపులు జరిపి, వారిలో విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలనుకునే దేశం భారత్ కాదని చెప్పారు.
దేశంలో మెజారిటీ హిందువులు లౌకిక వాదులని, మత ప్రాతిపదికన ఎలాంటి వివక్ష లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. మహిళల పట్ల వివక్ష చూపే ఏ మతాన్ని మతం అనలేమని, ఇది ఏ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించినది కాదని ఆయన పేర్కొన్నారు. మతం ప్రాతిపదికన, ముఖ్యంగా మహిళలపై ఎలాంటి వివక్షనైనా నిరోధించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలను తాను సమర్థిస్తానని, ఈ విషయంలో రాజకీయ పార్టీలు తమ విభేదాలను వీడనాడి వీలైనంత త్వరగా అమలు చేయాలన్నారు. తరుచూ ఎన్నికలు జరుగుతుండటం వల్ల దేశ అభివృద్ధికి ఆటంకం జరుగుతోందని చెప్పారు.