
హైదరాబాద్: కన్నతల్లి, మాతృభాష, మాతృభూమిని ఎప్పుడూ మరవద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని హోటల్ దస్పల్లాలో బుధవారం (ఏప్రిల్ 16) ఆంధ్రప్రదేశ్ మాజీ ఐజీ సీఆర్ నాయుడు ఆత్మకథ కొండమెట్లు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఆర్ నాయుడు చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలిచారని.. ఆయన రాసిన ఈ పుస్తకాన్ని మనందరం మనం మస్తకంలోకి ఎక్కించుకోవాలన్నారు. చాలా మంది ఆత్మకథ రాయమని అడిగారని.. కానీ నేను రాయను అని చెప్పానన్నారు. ఇంత తక్కువ పేజీల్లో ఆత్మకథ రాయడం గొప్ప విషయమని.. కొండమెట్లు అనే పేరు చాలా గొప్పగా ఉందని కొనియాడారు.
నేటి యువతరానికి ఈ పుస్తకం చాలా అవసరమన్నారు. నాయుడు.. వ్యక్తిత్వం, కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం చాలా మంచివని.. యువతకు ఆదర్శప్రాయమన్నారు.పుస్తకాన్ని తన భార్యకు అంకితం ఇవ్వడం అభినందనీయమన్నారు. పుస్తకం రాయడం వెనుక.. మనం సాధించిన విజయాల వెనుక ఉన్న కష్టాలు, ప్రణాళికలు తరువాతి తరానికి అందించడమేనన్నారు.- నేను పదవి విరమణ చేశాను గానీ పెదవి విరమణ చేయలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమయపాలన, అంకితభావం, నిబద్ధత మనల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయని పేర్కొన్నారు.
దేశ పోలీసు వ్యవస్థ బాగుందంటే కొందరు అధికారుల నిజాయతీ అని అన్నారు. దేశభక్తి అంటే ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయడమేనని.. అలా చేస్తే దేశం మరింత వేగంగా ముందుకు వెళ్తామన్నారు. టెక్నాలజీ పెరిగేకొద్దీ భయంకర పరిస్థితులు వస్తాయేమో అనే నా ఆందోళన అని.. సోషల్ మీడియాను స్వేచ్ఛ పేరిట దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఫోన్ల వల్ల- పిల్లలు, పెద్దలు.. కలిసి సమయం గడపడం లేదని.. పిల్లల్ని గ్యాడ్జెట్స్‌కి బానిస అవకుండా చూడాలని సూచించారు.