కోనరావుపేట, వెలుగు : నెలన్నర కింద కుక్క కరవడంతో రేబిస్ లక్షణాలతో చికిత్స పొందుతూ మాజీ వీఆర్ఏ చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన మంకు అరుణ్ (30) గతంలో వీఆర్ఏగా పనిచేశాడు. అరుణ్ నానమ్మ అనారోగ్యం బారిన పడగా మండలంలోని నిజామాబాద్ వెళ్లాడు. ఫిబ్రవరి 22న గ్రామంలోని ఓ కుక్క అరుణ్‌తో పాటు మరో ఏడుగురిని కరిచింది.
స్థానికంగా ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని టీకాలు కూడా వేయించుకున్నాడు. కానీ, 15 రోజుల కింద కాళ్లు గుంజడం, జ్వరంతో అస్వస్థతకు గురి కాగా కుటుంబసభ్యులు హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి నాలుగు రోజుల కింద గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు అక్కడి డాక్టర్లు శాంపిల్స్తీసుకున్న ముంబయికి పంపించారు. ఆ రిపోర్టులు రాక ముందే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి అరుణ్చనిపోయాడు. సుమారు రూ.16 లక్షలు ఖర్చు చేసినా తన కొడుకు దక్కలేదని తల్లిదండ్రుల కంటతడి పెట్టుకున్నారు. కోనరావుపేట తహసీల్దార్ నరేందర్, డీటీ సత్యనారాయణ, తహసీల్దార్ ఆఫీసు సిబ్బంది..అరుణ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.