'ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి..' అన్న సామెత వెస్టిండీస్ జట్టుకు సరిగ్గా సరిపోతోంది. గతంలో విండీస్ వీరులు ఓడించని జట్టు లేదు.. కానీ ఇప్పుడు ఈ వీరులను ఓడించని జట్టు లేదు. రెండు సార్లు ప్రపంచ కప్ విజేత అయిన వెస్టిండీస్ జట్టు, 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. వరల్డ్ కప్‌కి నేరుగా అర్హత సాధించలేకపోయిన విండీస్, క్వాలిఫైయర్స్‌లోనూ ఓడి.. ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.
ఇంత ఘోర ఓటములు ఎదురవుతున్నా.. ఆ జట్టు మాజీ ఆటగాళ్ల నోటి నుంచి మాటలు మాత్రం ఆగటం లేదు. మమ్మల్ని ఓడించటం అంత తేలిక కాదంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. జూలై 12 నుంచి ఇండియా - వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ జట్టు కోచ్ బ్రియన్ లారా మాట్లాడుతూ.. మాకు గెలవడం కష్టమేమో కానీ, మమ్మల్ని ఓడించటం మాత్రం అంత తేలికైన పని కాదని తెలిపారు.
"ఇండియా బలమైన జట్టే. స్వదేశంలో అయినా విదేశంలో అయినా వారిని ఓడించడం కష్టమే. అయితే మా అడ్డాలో మమ్మల్ని ఓడించడం కూడా అంత తేలిక కాదు. టెస్ట్ ఫార్మాట్‌లో వెస్టిండీస్ ప్రయాణం సరైన దిశలోనే సాగుతోందన్నది నా అభిప్రాయం. ఈ టెస్ట్ సిరీస్‌కు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న కుర్రాళ్లను ఏరికోరి ఎంపిక చేశాం. వారి ఆట తీరు, ఆత్మవిశ్వాసం చూశాక.. నాకు భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి. బ్రెత్‌వైట్ కెప్టెన్సీలో కుర్రాళ్లకు వారికి ఇదొక చక్కని అవకాశం. బలమైన జట్టుతో ఆడుతున్నాం కనుక ఎన్నో కొత్త విషయలు నేర్చుకోవచ్చు. బాగా రాణించి.. జట్టుకు విజయాలు అందిస్తారని అనుకుంటున్నా.." అని వెస్టిండీస్ మాజీ దిగ్గజం, కోచ్ బ్రియాన్ లారా చెప్పుకొచ్చారు.
మరి వెస్టిండీస్ జట్టు.. కోచ్ నమ్మకాన్ని నిలబెట్టగలదా! అన్నదే ప్రశ్న. అసలే ఈమధ్య పసికూన జట్ల చేతిలో కూడా ఓడి ఆ జట్టు ఆటగాళ్లు.. తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇలాంటి సమయంలో బలమైన టీమిండియాను ఓడించటం అంటే వారికి కష్టమైన పనే.