30న మహబూబ్​నగర్​లో రైతు విజయోత్సవ సభ

  • వచ్చే నెల 7, 8, 9న ట్యాంక్​బండ్, 
  • నెక్లెస్ రోడ్​లో కార్నివాల్, లేజర్ షో: భట్టి

హైదరాబాద్, వెలుగు:  మహబూబ్‌‌నగర్‌‌లో ఈ నెల 30న రైతు విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. డిసెంబర్​ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్​లోని ట్యాంక్‌‌బండ్‌‌, నెక్లెస్‌‌రోడ్‌‌ మార్గాల్లో భారీ కార్నివాల్‌‌, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు.  ప్రజాపాలన విజయోత్సవాలపై శుక్రవారం సెక్రటేరియెట్​లో భట్టి, మంత్రులు ఉత్తమ్‌‌ కుమార్‌‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, సీతక్కతో కూడిన కేబినెట్​ సబ్​ కమిటీ ఉన్నతాధికారులతో సమావేశమైంది. 

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చేపట్టిన విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలను ప్రతి గడపకూ చేరవేసేలా విస్తృతస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్​ లో 3 రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో  మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

ఇప్పటికే ప్రతీ జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ విజయవంతంగా జరుగుతున్నాయని,  ప్రతీ గ్రామ స్థాయినుంచి మండలాలు, జిల్లాస్థాయి వరకు పండుగ వాతావరణంలో నిర్వహించాలని తెలిపారు.  గురుకుల పాఠశాలలు,  ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు  వ్యాసరచన పోటీలను నిర్వహించాలని సూచించారు.   ఏడాది పాలనలో సాధించిన విజయాలు, సక్సెస్ స్టోరీలను వెబ్​సైట్స్​, సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. 

 రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం, బ్యాంకు లింకేజీలు, సన్న వడ్లకు 500 బోనస్​లాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. ప్రభుత్వ విజయాలపై ప్రత్యేకంగా రూపొందించిన హోర్డింగులు, షార్ట్​ ఫిలిమ్స్, ప్రకటనలు, సోషల్ మీడియాలా ద్వారా విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించాలని పొంగులేటి తెలిపారు.