ఢిల్లీలో పొగకు రైతులే కారణమా?

ఢిల్లీలో ఏటా దసరా దాటగానే ఎయిర్​ పొల్యూషన్​ పెద్ద సమస్య అవుతోంది.  దీనికి చాలా కారణాలున్నా… ఢిల్లీ ప్రభుత్వం మాత్రం పంజాబ్​, హర్యానా, పశ్చిమ  యూపీ రైతులను దోషులుగా నిలబెడుతుంది. వాళ్లు వరి, గోధుమ దుబ్బుల్ని పొలాల్లోనే కాల్చేయడంతో ఆ పొగ మొత్తం ఢిల్లీపైకి వచ్చేస్తుందన్నది ప్రధాన ఆరోపణ. మరి, ఇండస్ట్రియల్​, వెహికల్స్​, కనస్ట్రక్షన్​ పొల్యూషన్ మాటేమిటని  రైతులు నిలదీస్తున్నారు. పొల్యూషన్​లో చిన్న పెద్ద వెహికల్స్​ వాటా 63 శాతం. భారీ ట్రక్కుల వాటా 65 శాతం. ఢిల్లీకి ‘గ్రీన్​ కవర్​’గా ఉండాల్సిన ఆరావళి పర్వతాల్ని మార్బుల్​ మైనింగ్​కోసం చెక్కేయడంకూడా ఒక కారణమే.

ఒకపక్క ఢిల్లీ నగరం పొగతో కమ్ముకుపోతోంది. జనాలు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. విమానాల్ని, రైళ్లను సైతం సకాలంలో నడపలేని పరిస్థితి. ఇది ఏటా దసరా దాటాక నేషనల్​ క్యాపిటల్​ రీజియన్​ (ఎన్సీఆర్)కి ఆనవాయితీగా వస్తున్న సమస్య.  ఢిల్లీకి పట్టిన ఈ దుస్థితికి పంజాబ్‌, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్​ రైతుల నిర్వాకమే కారణమని అంటున్నారు. వాళ్లు ఏటా మొదటి (ఖరీఫ్‌) పంటను కోయగానే తదుపరి పంటకు భూమిని సిద్ధం చేసే క్రమంలో… పొలాల్లో మిగిలిపోయిన  వరి, గోధుమ మొదళ్లకు నిప్పు పెడుతుంటారు. ఏటా రెండు కోట్ల 30 లక్షల టన్నుల మేర దుబ్బుల్ని రైతులు పొలాల్లోనే కాల్చేస్తున్నారు. పంట విస్తీర్ణం పెరుగుతున్నకొద్దీ పొలాల్లో వరి, గోధుమ దుబ్బులుకూడా పెరుగుతుంటాయి. ఆ పొగ మొత్తం గాలివాటువల్ల దక్షిణ దిశగా ప్రయాణించి ఎన్సీఆర్‌ని కమ్ముతోంది.

చలికాలం ప్రారంభమై ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో పొగమంచు నిండిపోయి ఉంటుంది. వాయు కాలుష్యానికి పంట దుబ్బుల్ని తగలబెట్టడంతోపాటు… కనస్ట్రక్షన్స్​వల్ల దుమ్మూ ధూళి, వాహనాల పొగ, ఫ్యాక్టరీలు గాల్లోకి వదిలే వాయువులూ ఇవన్నీకూడా కారణమే. ఎన్సీఆర్​ పరిధిలో దాదాపు 25 ఇండస్ట్రియల్​ ఏరియాలున్నాయి. వీటన్నింటి నుంచి వెలువడే పొగతో ఎయిర్​ పొల్యూషన్​ భరించలేని స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో 19 చోట్ల ఎయిర్​ క్వాలిటీ 999 పాయింట్లకు చేరడంతో, 40 శాతం మంది ఢిల్లీవాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతామంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పడిన ఎన్విరాన్​మెంట్​ పొల్యూషన్​ కంట్రోల్​ అథారిటీ (ఈపీసీఏ) ‘పబ్లిక్​ హెల్త్​ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది.

దీపావళికి ముందే ఎయిర్​ పొల్యూషన్​ విషయంలో చాలా వార్నింగ్స్​ ఇచ్చినా ఫలితం లేకపోయింది. నాసా శాటిలైట్​ వీఐఐఆర్​ఎస్​ రికార్డు చేసిన వివరాల ప్రకారం… పంజాబ్,​ హర్యానాల్లో కేవలం రెండు రోజుల్లోనే 2,000 చోట్ల పంట మొదళ్లను కాల్చినట్లుగా తేలింది. మొత్తంగా పంజాబ్​లో 22,000 ఘటనలు, హర్యానాలో 4,200 ఘటనలు చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు.

ఎన్నికల హడావుడితో మానిటరింగ్ లేదు

2018 నాటి డేటాతో పోలిస్తే ఈ ఏడాది 9 శాతం ఎక్కువగా పొలాల్ని తగలబెట్టడం జరిగిందని కేంద్ర పొల్యూషన్​ మానిటరింగ్​, రీసెర్చ్​ సంస్థ సఫర్​ లెక్కలు తీసింది.   ఈ ఏడాది వరి పంట చేతికొచ్చేసరికి చాలా లేటయ్యింది. దానికితోడు వర్షాలు జోరుగా కురిసేసరికి పొలాల్ని రెండో పంటకు సిద్ధం చేయడం వీలు కాలేదు.  ఈలోగా రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావుడి మొదలవడంతో సరైన మానిటరింగ్​ జరగలేదు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, పంజాబ్​లో కొన్ని ఎమ్మెల్యే సీట్లకు బైఎలక్షన్స్​ జరిగాయి. దీంతో రైతుల జోలికి అధికార యంత్రాంగం వెళ్లకుండా అక్కడి ప్రభుత్వాలు అడ్డం పడ్డాయి.

సమయం, వ్యయం రెండూ కలిసొస్తాయనే  రైతులు తమకు అలవాటైన పద్ధతిలో పొలాన్ని శుభ్రం చేసుకుంటున్నారు. కాలుష్యం ఊసెత్తితే వాళ్లకు కోపం తన్నుకొస్తుంది. ‘మా వల్లే ఎన్సీఆర్​ ఏరియాలో పొగ కమ్ముతోందని ఎలా చెబుతారు? అక్కడ ఎన్ని కార్లు లేవు, ఎన్ని ఫ్యాక్టరీలు లేవు? వాటిని ఎవరూ పట్టించుకోరేం’ అని కస్సుమంటున్నారు. ఈ సమస్యకు సరైన ప్రత్యామ్నాయం చూపించలేకపోవడం ప్రభుత్వం తప్పేనని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పంట మొదళ్లు కాల్చడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న ఇంటర్నేషనల్​ నాన్​–ప్రాఫిట్​ రీసెర్చ్​ ఆర్గనైజేషన్​ సిమ్మిత్​కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది రైతులు సీడర్​ మెషీన్లను తెచ్చుకుని వాడుతున్నారని, పొలాల్లో దుబ్బుల్ని కాల్చడం తగ్గించారని సిమ్మిత్​కి చెందిన ప్రిన్సిపల్​ సైంటిస్టు ఎం.ఎల్​.జాట్​ చెబుతున్నారు.  ఇండస్ట్రీస్​ని కంట్రోల్​ చేయకుండా  మొత్తం నెపాన్ని రైతుల పైన, వాహన వినియోగదారుల పైన నెట్టేయటం సబబు కాదని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.  ఈ నేపథ్యంలో కాలుష్య నివారణ అనేది తాత్కాలిక నిర్ణయాలతో అయ్యే పని కాదు. దీనికోసం రాష్ట్రంలోని అన్ని పార్టీల లీడర్లు, వ్యాపార వర్గాలు ఒక్కతాటిపైకి వచ్చి సిన్సియర్‌గా, సీరియస్‌గా చర్చించటం చాలా అవసరం.

ఫైన్​ కట్టడమే చౌక

రెండు రాష్ట్రాల రైతులతోపాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్​లోనూ రబీ సీజన్‌ కోసం భూమి దున్నుతున్నారు. వరి, గోధుమ, జొన్న, చెరకు పొలాల్లో కోతలు ముగిశాక మొదళ్లకు మంటపెట్టి వదిలేస్తున్నారు.  పొలాల్లో దుబ్బుల్ని తగలబెట్టొద్దని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్జీటి), కోర్టులు పదే పదే హెచ్చరించినా రైతులు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే, పంజాబ్‌లో ఒక్కో రైతు కూలీకి రోజుకు రూ.350 నుంచి రూ.400 వరకు ఇవ్వాలి. ఎకరా పొలాన్ని శుభ్రం చేయాలంటే కనీసం 10 మంది కూలీలు కావాలి. వాళ్లు తవ్వి తీసిన మొదళ్లను ట్రాక్టర్లకు ఎత్తించి, ఎక్కడో దూరంగా ఉండే యార్డ్​లకు తరలించాంటే ఎక్‌స్ట్రా ఖర్చవుతుంది. ఒక్కో ఎకరాకి కూలీల ఖర్చు 4,000, ట్రాక్టర్​ ఖర్చు సుమారుగా 4,000 వేసుకుంటే, మొత్తంగా 8,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. పైగా రోజంతా కష్టపడాలి. అదే గనుక మొదళ్లకు మంటపెడితే రెండు మూడు గంటల్లోనే పొలం ఖాళీ అయిపోతుంది. దీంతో ఫైన్​ కట్టడానికైనా రెడీ అయిపోతున్నారుగానీ, దుబ్బులు కాల్చడాన్నిమాత్రం మానడం లేదు., పంట మొదళ్లకు మంట పెడితే ఎకరాకి రూ.2,500 జరిమానా వేస్తారు. కూలీలతో దుబ్బులు తవ్వి తీయించడానికయ్యే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువే. హ్యాపీ సీడర్​ మెషీన్లు ఇచ్చినా ఖర్చు పెరగుతోంది. అందుకే తమకు చవకలో ఆల్టర్నేటివ్​ చూపిస్తే మానుకుంటామని పంజాబ్​, హర్యానా  రైతులు చెబుతున్నారు.