
సంగారెడ్డి, వెలుగు : ప్రాజెక్టుల పట్ల బీఆర్‌ఎస్ చేసిన పాపం వల్లే ఆ పార్టీకి ఈ గతి పట్టిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రాజెక్టుల్లో సరైన విధంగా నీళ్లు నింపి, సక్రమమైన పాలన సాగిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో జరిగిన మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. ఎస్సారెస్పీ, శ్రీశైలం డ్యామ్‌ల వల్లే జిల్లాల్లో పంటలు పండుతున్నాయని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ చేసిన పనుల వల్ల రైతులు ఎంతో నష్టపోయారన్నారు.
అసెంబ్లీకి రాని కేసీఆర్, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందునే జనాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులను కాదని తెలంగాణ ద్రోహులకు అవకాశాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రజలు రెండోసారి కూడా బీఆర్‌ఎస్‌కు పట్టం కడితే వారిలో మార్పు రాకపోగా, మరిన్ని అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో పనులను చేశామని చెప్పారు. హరీశ్‌రావు, కేటీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కే లేదన్నారు.
మెదక్ పార్లమెంట్ నుంచి బరిలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్ క్యాండిడేట్లు ఇద్దరూ దొంగలేనన్నారు. వీరిద్దరిని ఓడించి కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధును గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ హయాంలో వెంకట్రామిరెడ్డి ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడి పేదల పొట్ట కొట్టాడన్నారు. వెంకట్రామిరెడ్డి సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న టైంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ ముంపు బాధితులు ఎంతో గోస పడ్డారన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మెదక్ ఎంపీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు.