ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ.. రైతుల ఆందోళన ఉద్రిక్తం

  •     నిర్మల్​జిల్లాలో నిర్మాణ పనులను అడ్డుకున్న అన్నదాతలు 
  •     సామగ్రి, ఆఫీస్ అద్దాలు కారు ధ్వంసం  
  •     పోలీసుల లాఠీచార్జి  
  •     అడిషనల్ కలెక్టర్ హామీతో తాత్కాలిక విరమణ

నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా దిలావర్​పూర్,​ నర్సాపూర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఫ్యాక్టరీ వద్దంటూ రైతులు నెల రోజుల నుంచి రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. అయినా పట్టించుకోకపోవడంతో బుధవారం దిలావర్​పూర్​, గుండంపెల్లి గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిర్మాణ పను లను అడ్డుకున్నారు. 

ఆఫీసుతో పాటు  నిర్మాణ సామగ్రి, మేనేజ్​మెంట్​కు చెందిన కారును ధ్వంసం చేశారు. ఇది చూసిన ఫ్యాక్టరీ నిర్వాహకులు, కూలీలు అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో రైతులపై లాఠీచార్జి చేశారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ బాబు వచ్చి రైతులతో మాట్లాడారు. అందరూ కలిసి వినతిపత్రం ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

పలువురు రైతులు మాట్లాడుతూ తాము నెల రోజుల నుంచి ఇథనాల్ ఫ్యాక్టరీ తరలించాలని కోరుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ప్రజాప్రతినిధులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఫ్యాక్టరీ వల్ల తమ పచ్చని పొలాలు కాలుష్యం బారిన పడతాయన్నారు.  ఫ్యాక్టరీ నిర్మాణం ఆపేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.