
- ఎఫ్‌ఈవో కంపెనీ సీఈవో స్టేట్‌మెంట్ రికార్డు చేస్తేనే ముందుకు!
- గత నెల 25న నోటీసులుజారీ చేసిన ఏసీబీ
- 4 వారాలు సమయం కోరిన ఎఫ్‌ఈవో
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా – ఈ కార్ రేస్‌కేసులో ఏసీబీ ఎంక్వైరీకి తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. ఫార్ములా ఈ ఆపరేషన్స్(ఎఫ్‌ఈవో) సీఈవో స్టేట్‌మెంట్ రికార్డు చేస్తే తప్ప.. దర్యాప్తు ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు. ఎఫ్‌ఈవో ప్రతినిధులు ఇచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగానే తదుపరి విచారణకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా – ఈ రేస్ పేరుతో ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, ఏస్ ఎన్‌ఎక్స్‌టీ జెన్ స్టేట్‌మెంట్స్‌ను ఏసీబీ అధికారులు ఇప్పటికే రికార్డు చేశారు.
విచారణలో భాగంగా ఎఫ్‌ఈవో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు గత నెల 25న అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, విచారణకు వచ్చేందుకు ఆ సంస్థ ప్రతినిధులు నాలుగు వారాల సమయం కోరారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన గడువులో ఇప్పటికే వారం రోజులు గడిచాయి. మరో మూడు వారాల వరకు ఎఫ్‌ఈవో ప్రతినిధులు విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవు. దీంతో అప్పటి వరకు ఏసీబీ దర్యాప్తులో పురోగతి ఉండకపోవచ్చని తెలిసింది.
అగ్రిమెంట్స్, నిధుల మళ్లింపు లెక్కలు ఎఫ్‌ఈవో వద్దనే..
బ్రిటన్‌కు చెందిన ఫార్ములా – ఈ ఆపరేషన్స్, హైదరాబాద్‌కు చెందిన గ్రీన్ కో సిస్టర్ కంపెనీ ఏస్ ఎన్‌ఎక్స్‌టీ జెన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్(ఎంఏయూడీ) మధ్య 2022 అక్టోబర్25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో సీజన్ 9,10,11,12 కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాలను ఎంఏయూడీ కల్పించే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించారు. వివిధ కారణాల చేత ఏస్ ఎన్‌ఎక్స్‌టీ, ఫార్ములా – ఈ ఆపరేషన్స్ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఎఫ్‌ఈవోకు చెల్లించాల్సిన రూ.45.71 కోట్లు హెచ్‌ఎండీఏ అకౌంట్ నుంచి ఎంఏయూడీ చెల్లించింది.
అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్‌ఈవోకు బదిలీ చేశారు. ఇందుకు సంబంధించి హెచ్‌ఎండీఏ రిటైర్డ్ సీఈ బీఎల్‌ఎన్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ను ఏసీబీ ఇప్పటికే రికార్డ్ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్‌రెడ్డి స్టేట్‌మెంట్స్‌తో పాటు సాక్షిగా ఏస్ ఎన్‌ఎక్స్‌టీ జెన్ విచారణ కూడా పూర్తయింది. వీరి వద్ద సేకరించిన వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు ఎఫ్‌ఈవో ప్రతినిధుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు.