* ఈడీ విచారణకు హాజరు కాని బీఎల్ఎన్ రెడ్డి
* తానూ రాలేనంటూ ఈడీకి అరవింద్ లేఖ
* 7న మాజీ మంత్రి కేటీఆర్ నూ రమ్మన ఈడీ ఆఫీసర్లు
* కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను రిజర్వ్ లో పెట్టిన హైకోర్టు
* సానుకూలంగా తీర్పు వస్తుందని భావించే ఏ2, ఏ3 ఈడీ విచారణకు వెళ్లడం లేదా..?
* ఆసక్తికరంగా మారిన నిందితుల లేఖలు
హైదరాబాద్: ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణ ఎదుర్కోవాల్సిన ఇద్దరు అధికారులు తాము రాలేమంటే లేఖలు రాయడం ఆసక్తికరంగా మారింది. తమకు సమయం కావాలని పేర్కొంటూ ఈడీకి మెయిల్ పంపడం చర్చనీయాంశమైంది. ఇవాళ విచారణకు వెళ్లాల్సిన హెచ్ఎండీఏ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి తాను రాలేనని, సమయం కావాలని లేఖ రాశారు. రేపు (శుక్రవారం) విచారణకు వెళ్లాల్సిన సీనియర్ ఐఏఎస్ అధికారి, అప్పటి హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా ఇవాళ (గురువారం) మధ్యాహ్నం ఈడీకి లేఖ పంపారు. తాను విచారణకు రాలేనని సమయం ఇవ్వాలని కోరారు. వీరిద్దరి లేఖలకు ఈడీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఇదే కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ఈ నెల 7న ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. ఆయన విచారణకు హాజరవుతారా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది.
మాజీ మంత్రి కేటీఆర్ తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని, విచారణ చేయవచ్చునని గత నెల 31న విచారణ సందర్భంగా హైకోర్టు ఏసీబీకి తెలిపింది. కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసును కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదించారు. అసలు అవినీతే జరగలేదన్నారు. కేసును 14 నెలలు ఆలస్యంగా ఫైల్ చేశారని, ఇది రాజకీయ కక్ష అంటూ పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసు దర్యాప్తు దశలో ఉందని, ఈ సమయంలో అడ్డుకోవడం సరికాదని అన్నారు. అవినీతి జరిగేందుకు ప్రాథమిక ఆధారాలనూ ప్రస్తావించారు. ఇరు పక్షాల వాదనలూ నమోదు చేసుకున్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఇదే సందర్భంగా తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని సూచించింది. ఈ పరిణామాలు తమకు అనుకూలంగా మారుతాయని భావించే ఏ2గా ఉన్న అరవింద్ కుమార్, ఏ3గా ఉన్న బీఎల్ ఎన్ రెడ్డి ఈడీ విచారణకు వెళ్లలేదా..? అనే చర్చ మొదలైంది. ఎఫ్ఐఆర్ క్వాష్ చేస్తే తామపై కూడా కేసు ఉండదని వీళ్లిద్దరూ భావిస్తున్నారని తెలుస్తోంది.
ఇవాళ విచారణకు వెళ్లాల్సిన బీఎల్ఎన్ రెడ్డి ఈడీకి లేఖ పంపడం.. ఆ తర్వాత గంటల వ్యవధిలో అరవింద్ కుమార్ కూడా లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఈడీ విచారణకు కేటీఆర్ వెళ్లడం అనుమానమే అనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఫార్ములా–ఈ కేసు నిందితులంతా హైకోర్టు తీర్పు మీదే ఆశలు పెట్టుకున్నారు. తమకు అనుకూలంగా రావాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారనే టాక్ ఉంది.