Formula E Car Race :రెండ్రోజుల్లో కేటీఆర్​కు ఈడీ నోటీసులు

Formula E Car Race :రెండ్రోజుల్లో కేటీఆర్​కు ఈడీ నోటీసులు
  • ఫార్ములా–ఈ రేస్ కేసులో విచారించేందుకు ఏర్పాట్లు
  • మరో ఇద్దరు నిందితులు, బ్యాంక్ అధికారుల విచారణకూ రంగం సిద్ధం  
  • ఇప్పటికే షెడ్యూల్ ప్రిపేర్ చేసిన అధికారులు 

హైదరాబాద్‌‌, వెలుగు: ఫార్ములా–ఈ రేస్​ కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ సహా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అర్వింద్‌‌ కుమార్‌‌‌‌, హెచ్ఎండీఏ మాజీ చీఫ్‌‌ ఇంజినీర్‌‌ బీఎల్‌‌ఎన్‌‌ రెడ్డిని విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. వీళ్లతో పాటు బ్యాంక్‌‌ అధికారులను కూడా విచారించేందుకు ఏర్పాట్లు చేసింది. వీళ్లందరికీ రెండ్రోజుల్లో నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు శనివారం షెడ్యూల్‌‌ రూపొందించింది. దీని ప్రకారం కేసులోని నిందితులు సహా బాధ్యులైన అధికారులకు సోమవారం నుంచి వరుసగా నోటీసులు అందించనున్నట్టు తెలిసింది. దర్యాప్తులో భాగంగా మొదట బ్యాంక్‌‌‌‌ అధికారులను ఈడీ విచారించనున్నట్టు సమాచారం.

 ఆ తర్వాత కేటీఆర్ సహా ఇతరులను విడతల వారీగా ప్రశ్నించనుంది. కాగా, ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఫార్ములా–ఈ రేస్ కు సంబంధించి ఏసీబీ అందజేసిన డాక్యుమెంట్లను పరిశీలించింది. ఈ రేస్ కోసం జరిగిన ఒప్పందాలు, సీజన్ 9, 10 కోసం హెచ్ఎండీఏ నుంచి జరిగిన చెల్లింపుల వివరాలను తెలుసుకున్నది. పోయినేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3,11 తేదీల్లో హెచ్‌‌‌‌ఎండీఏ నిధుల నుంచి బ్రిటన్ లోని ఫార్ములా–-ఈ ఆపరేషన్స్‌‌‌‌ (ఎఫ్ఈవో) కంపెనీకి రూ.45.71 కోట్లు బదిలీ చేసినట్టు గుర్తించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ లావాదేవీలపైనే ఈడీ ఫోకస్ పెట్టింది. ఇందులో బ్యాంక్ అధికారుల పాత్రపైనా ఆరా తీస్తున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులను విచారించనుంది. 

ఏసీబీ దర్యాప్తు కూడా స్పీడప్.. 

ఈడీతో పాటు ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 30 వరకు కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను అరెస్టు చేయొద్దని, కానీ కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎంక్వైరీ స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా హెచ్‌‌‌‌ఎండీఏ అకౌంట్స్‌‌‌‌ ఉన్న హిమాయత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులను విచారించనున్నారు. సోమవారం బ్యాంక్ మేనేజర్ సహా సంబంధిత అధికారులు, ఎంఏయూడీ చీఫ్‌‌‌‌ సెక్రటరీ దానకిశోర్‌‌‌‌  స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ కూడా రికార్డ్‌‌‌‌ చేయనున్నట్టు తెలిసింది.