హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేయడం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. దీంతో.. ఈ కేసులో న్యాయపరంగా ముందుకెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలిసింది. FIR నమోదు కావడంతో క్వాష్ పిటిషన్ వేసేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో కేటీఆర్ ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. శుక్రవారం(డిసెంబర్ 20, 2024) కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని క్వాష్ పిటిషన్లో కేటీఆర్ కోరే అవకాశం ఉంది.
ఫార్ములా –ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదు కావడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకున్నట్టయింది. ఆయనను ఏ1గా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ని ఏ2గా ఎఫ్ఐఆర్లో పేర్కొంది ఏసీబీ. వీళ్లకు తర్వలోనే నోటీసులు అందించి విచారణ చేపట్టే అవకాశం ఉంది.
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ పేర్కొంది. నాలుగు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఇటీవలే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేటీఆర్ విచారణకు అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం విచారణ బాధ్యతను ఏసీబీకి అప్పగించింది. దీంతో ఇవాళ(గురువారం, డిసెంబర్ 19) కేసులు నమోదయ్యాయి. ఈ వివాదంలో ఏ3గా అప్పటి హెచ్ఎండీఏ చిఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. దీంతో పాటు ఓ ప్రైవేటు కంపెనీపైనా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల్లో ఈ కేసులో కీలకమైన వ్యక్తులను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.