- ఫార్ములా–ఈ రేస్ ఆపరేషన్స్‌కు ఏకపక్షంగా చెల్లింపులు
- హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్
- అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు54 కోట్లు బదిలీ
- ఈ విషయం కేటీఆరే స్వయంగా ఒప్పుకున్నరు
- ఆయన చర్యలు బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకమని వెల్లడి
- ఈ నెల 31 దాకా కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేస్ ఆపరేషన్స్‌కు నాడు మంత్రి హోదాలో కేటీఆర్ ఏకపక్షంగా చెల్లింపులు చేశారని ఏసీబీ తెలిపింది. ఆయన తన ఆధీనంలోని మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని పేర్కొంది. కేటీఆర్ నేరం చేసినట్లు ఆధారాలు ఉన్నాయంటూ హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కేబినెట్ సమ్మతి, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాలని నాడు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అందులో ప్రస్తావించింది. ఇలా ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమంది. విదేశీ సంస్థకు అనుమతులు లేకుండానే రూ.54 కోట్లు బదిలీ చేశారని తెలిపింది.
ఇలా చేయడం ద్వారా హెచ్‌ఎండీఏపై రూ.8 కోట్లకుపైగా ఇన్‌కం ట్యాక్స్ భారం పడిందని వివరించింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌లో ఏసీబీ తరఫున ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.
కేటీఆర్ వాదన చట్టవ్యతిరేకం
నిబంధనలు, బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకంగా కేటీఆర్ చర్యలు ఉన్నాయన్నారు. రికార్డుల్లోని సమాచారానికి విరుద్ధంగా కేటీఆర్ చెబుతున్నారని, రికార్డుల ప్రకారం చూసినప్పుడు ప్రాథమికంగా ఆయన నేరానికి పాల్పడినట్లు రుజువు అవుతోందన్నారు. రాజకీయ కక్షతో, ఒత్తిళ్లతో ఫిర్యాదు చేశారంటూ కేటీఆర్ చేసే వాదన చట్టవ్యతిరేకమన్నారు. ఎస్‌ఈఓకు చెల్లింపులు జరపాలని తానే చెప్పినట్లు కేటీఆర్ స్వయంగా వెల్లడించారన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యం జరిగిందని, ఈ కారణంగా కేసును కొట్టేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.
అభియోగాలను నిర్ధారణ చేసుకున్నామని, విచారణ జరిపి వివరాల సేకరణకు సమయం పట్టిందని వివరించారు. కాగ్నిజెన్స్ తీసుకోగల కారణాలు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నప్పుడు కోర్టులు కేసు ప్రాథమిక విచారణ దశలో అడ్డుకోడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు కేసుల్లో ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. కేటీఆర్‌పై కేసును విచారణ చేపట్టేందుకు వీలుగా ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. ఎస్‌ఐఆర్ దాఖలైన 24 గంటల్లోనే అసంబద్ధమైన కారణాలతో కేసును కొట్టేయాలని హైకోర్టుకు వచ్చారని తప్పుపట్టారు. చట్టప్రకారంగానీ, వాస్తవ ఆధారాలను పరిశీలిస్తే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదన్నారు.
ఒప్పందానికి ముందే చెల్లింపులు జరిగాయి
2022 అక్టోబరు 25న ఫార్ములా–ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్‌ఓ) మున్సిపల్ శాఖ ఏస్ నెక్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య 9, 10, 11, 12 సీజన్ రేస్‌లను హైదరాబాద్‌లో నిర్వహించాలని ఒప్పందం కుదిరిందని వివరించారు. 10వ సీజన్లో ప్రమోటర్ వైదొలగడంతో ఫార్ములా–ఈ రేస్ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే స్వీకరించిందన్నారు. ఇందుకు హెచ్‌ఎండీఏకు ప్రమోటర్‌గా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు. 2023 బకాయిల కింద హెచ్‌ఎండీ నే జనరల్ ఫండ్స్ నుంచి రూ.54.89 కోట్లు విదేశీ సంస్థకు చెల్లింపులు జరిగాయన్నారు.
సాధారణంగా రూ.10 కోట్లకు మించి చెల్లింపులు జరిగితే కేబినెట్ ఆమోదం విధిగా ఉండాలన్నారు. ఇవేమీ లేకుండా చెల్లింపులు జరిగాయన్నారు. విదేశీ సంస్థలకు చెల్లింపుల్లోనూ అనుమతులు పొందలేదన్నారు. కేటీఆర్ ఆదేశాలు, అనుమతితోనే చెల్లింపులు ఏకపక్షంగా జరిగాయని చెప్పారు. తొలి ఒప్పందం రద్దుకాగా రెండో సారి 2023 అక్టోబరు 30న ఎఫ్‌ఓ, మున్సిపల్ శాఖల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఈ అగ్రిమెంట్ జరిగేప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నారు. మూడేండ్లకుగాను ఫార్ములా–ఈ రేస్ నిమిత్తం రూ.600 కోట్లు వెచ్చించాల్సి ఉందని వివరించారు.
ఈసీ అనుమతి లేకుండా అగ్రిమెంట్ చేసుకునేలా కేటీఆర్ చొరవ తీసుకున్నారని వివరించారు. తొలి ఒప్పందం 2022 అక్టోబరు 15న జరగ్గా 2023 అక్టోబరు 27న రద్దయిందని తెలిపారు. తర్వాత 2023 అక్టోబరు 30న ఒప్పందం కుదిరిందని, అయితే అంతకు ముందే అంటే, అక్టోబరు 3, 11న హెచ్‌ఎండీఏ రూ.54.88 కోట్లు చెల్లింపులు చేసిందన్నారు. ఒప్పందానికి ముందే చెల్లింపులు జరగడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. రూ.10 కోట్లకు మించి చెల్లింపులు జరిగితే ప్రభుత్వం నుంచి హెచ్‌ఎండీఏ పర్మిషన్ తీసుకోవాలన్న నిబంధన అమలు కాలేదన్నారు. ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖ అనుమతి పొందలేదన్నారు.
30న రెండో ఒప్పందం కుదుర్చుకుని, 2022 నాటి ఒప్పందం మేరకు అంటే రద్దయిన ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు జరిగాయని, అదీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జరిగిందన్నారు. తొలి ఒప్పందం మేరకు ఫార్ములా–ఈ రేస్‌లో ట్రాక్ నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ పాత్ర పరిమితం అని, స్పాన్సర్ తరఫున చెల్లింపులు చేయాల్సిన అవసరం ఏమిటని, ఇదే అవినీతికి నిదర్శనమని చెప్పారు. కేటీఆర్ విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని, కుట్ర, నేరపూరిత దుష్ప్రవర్తన ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని అన్నారు. మున్సిపల్ శాఖ నుంచి లెటర్ వచ్చాక సంబంధిత ఆఫీసర్ల పర్మిషన్లు తీసుకున్నాకే కేటీఆర్‌పై కేసు నమోదు జరిగిందన్నారు. అంతా చట్ట ప్రకారమే జరిగిందన్నారు. ఎలాంటి నేరం చేయలేదంటూ కేటీఆర్ చెబుతున్న కారణాలన్నీ అసత్యాలేనని చెప్పారు. కనుక కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు.
వాదనలు వినకుండా ఉత్తర్వులు మార్చలేం: హైకోర్టు
ఫార్ములా-–ఈ రేస్ వ్యవహారంపై నమోదు చేసిన కేసులో కేటీఆర్‌ను ఈ నెల 31 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. గత విచారణ సందర్భంగా 30 వరకు అరెస్టు వద్దని ఆదేశాలు ఇవ్వగా, శుక్రవారం ఆ మధ్యంతర ఉత్తర్వులను 31వ తేదీ వరకు పొడిగించింది. అరెస్టు వద్దంటూ జారీ చేసిన ఉత్తర్వులను ఎత్తివేయాలని ఏసీబీ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. వాదనలు వినకుండా ఉత్తర్వులను మార్చలేమని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా వేసింది. ఫార్ములా-–ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై ఈ నెల 19న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఏ–1గా కేటీఆర్, ఏ–2గా నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, ఏ–3గా హెచ్‌ఎండీకే నాటి చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి పేరు చేర్చారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో ఈ నెల 20న లంచ్‌మోషన్ రూపంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి, ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. కేటీఆర్ అరెస్టు వద్దంటూ ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేసి ఆయన్ను విచారించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఏసీబీ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి నిరాకరించిన న్యాయమూర్తి.. విచారణను 31కి వాయిదా వేశారు. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
రాజకీయంగా అప్రతిష్ట పాల్జేయడానికే: కేటీఆర్
రాజకీయంగా తనను అప్రతిష్ట పాల్జేయడానికే దర్యాప్తు సంస్థలను వినియోగించుకుని, తప్పుడు కేసులు పెడుతున్నారని కేటీఆర్ హైకోర్టుకు తెలిపారు. ఒప్పందాల అమలులో ఏవైనా విధానపరమైన అంశాలను చూడాల్సింది సంబంధిత శాఖాధికారులేనని, మంత్రిగా అది తన బాధ్యత కాదని మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం హైకో ర్టుకు నివేదించారు. విదేశీ సంస్థకు నిధుల తర లింపు సమయంలోనూ అనుమతుల వ్యవహారాలను సంబంధిత బ్యాంకు చూసుకోవాలని, అంతేగానీ తాను కాదని స్పష్టం చేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న తన పిటిషన్‌లో ఏసీబీ కౌంటరుకు సమాధానంగా కేటీఆర్ రిప్లై కౌంటరు దాఖలు చేశారు.
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ద్వారా దర్యాప్తును అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నానడం సరికాదని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లోనే ప్రాథమికంగా నేరారోపణ వెల్లడికాకపోవడంతో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఆర్థికపరమైన ప్రభావాన్ని ఆలోచించకుండా ప్రభుత్వం స్పాన్సర్ పాత్రను భరించారనడం సరికాదన్నారు. 9 నుంచి 12వ సీజన్ వరకు 2023 మే 5లోగా స్పాన్సర్ చెల్లించాల్సిన 10వ సీజన్ ఫీజుపై ఎఫ్‌ఈఓ రాసిన లేఖపై ప్రమోటర్ స్పందించకపోవడంతో ప్రభుత్వం చొరవ తీసుకుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోటీలను 2023 జూన్ 20 నుంచి నిర్వహించడానికి షెడ్యూలు ఖరారు చేయడంతో ఎఫ్‌ఈఓతో ప్రభుత్వం సంప్రదించిందన్నారు. ప్రభుత్వం చర్చల వల్ల 10వ సీజన్ పోటీలను నిర్వహించడానికి ఎఫ్‌ఈఓ అంగీకరించిందని, ఫీజు మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లించడా నికి ఒప్పుకుందని తెలిపారు.
మొదటి విడత 25 శాతం 2023 సెప్టెంబరు 26న, 25 శాతం అక్టోబరు 4లోగా, మిగిలిన 50 శాతం అక్టోబరు 31లోగా చెల్లించాల్సి ఉందన్నారు. అప్పటి ప్రభు త్వ ప్రత్యేక కార్యదర్శి, అరవింద్ కుమార్ హెచ్ ఎండీయే కమిషనర్ హోదాలో పురపాలకశాఖ మంత్రి ఆమోదం కోసం ఫైలును ఉంచారన్నారు. 10వ సీజన్ నిర్వహణకు మొత్తం రూ.160 కోట్లు అనుమతించాలని ఫైలు ఉంచారన్నారు. హెచ్‌ఎండీయే చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ అని, ప్రమోటర్‌గా బాధ్యతలు తీసుకునే ముందు చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.