ఫార్ములా ఈ కారు రేసు కేసులో తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ.. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ ప్రాథమిక దశలో ఉంది కనుక హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు సైతం విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్రమంలో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై 2025, జనవరి 15వ తేదీన విచారణ చేసిన సుప్రీంకోర్టు.. కేటీఆర్ దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేసింది. విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణ కొనసాగించాలని.. విచారణకు హాజరవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేయటంతో.. పిటీషన్‌ను విత్ డ్రా చేసుకున్నది కేటీఆర్ లీగల్ టీం. సుప్రీంకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావించిన కేటీఆర్ కు ఇది షాక్. సుప్రీంకోర్టు సైతం విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. ఇక ఏసీబీ, ఈడీ విచారణలకు హాజరుకావాల్సిందే. వాళ్లు ఇచ్చిన నోటీసులకు స్పందించాల్సిందే. వాళ్లు పిలిచినప్పుడు వెళ్లాల్సిందే అనేది స్పష్టం అయిపోయింది.
ALSO READ | హైకోర్టులో కేటీఆర్ కు షాక్ : ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు గ్రీన్ సిగ్నల్
కేటీఆర్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో గట్టిగానే వాదనలు జరిగాయి. కేటీఆర్ తరపున సీనియర్ లాయర్ సుందరం వాదనలు వినిపించారు. ఇది ప్రభుత్వం పెట్టిన కక్ష సాధింపు కేసు అని.. ప్రభుత్వం మారగానే కేసు పెట్టారని.. ఇది ప్రభుత్వ ప్రాజెక్టు అని.. దీనికి అవినీతి నిరోధక చట్టం వర్తించదు అంటూ కేటీఆర్ లాయర్ వాదించారు.
ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కేసు విచారణకు తెలంగాణ గవర్నర్ అనుమతి ఇచ్చారని.. దర్యాప్తు జరిగితేనే నిజానిజాలు బయటకు వస్తాయని కోర్టులో వాదనలు వినిపించారు. కేసు కొట్టివేయాలని 24 గంటల్లోనే పిటీషన్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ప్రస్తావించారు ప్రభుత్వం తరపు లాయర్.