హైదరాబాద్‌లో ఫార్ములా‑ఈ రేస్‌ హిట్​

దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఫార్ములా–ఈ కార్​ రేస్‌‌‌‌‌‌‌‌  గ్రాండ్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయింది. హుస్సేన్‌‌‌‌‌‌‌‌ సాగర్‌‌‌‌‌‌‌‌ సమీపంలోని స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌పై శనివారం అత్యంత ఉత్కంఠగా సాగిన ‘హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ ప్రి’లో 11 జట్లకు చెందిన 22 మంది డ్రైవర్లు నువ్వానేనా అన్నట్టు పోటీ పడ్డారు. ట్రాక్‌‌‌‌‌‌‌‌పై మెరుపు వేగంతో దూసుకెళ్తూ  అభిమానులను అలరించారు. మెయిన్‌‌‌‌‌‌‌‌ రేసులో 33 ల్యాప్స్‌‌‌‌‌‌‌‌ను అందరికంటే వేగంగా పూర్తి చేసిన  డీఎస్‌‌‌‌‌‌‌‌ పెన్‌‌‌‌‌‌‌‌స్కీ  డ్రైవర్‌‌‌‌‌‌‌‌  జాన్‌‌‌‌‌‌‌‌ ఎరిక్‌‌‌‌‌‌‌‌ వెర్న్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌, రాష్ట్ర  ఐటీ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలు ఇచ్చారు.

ఇండియాలో ఫార్ములా‑ఈ చాంపియన్‌‌షిప్‌‌ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. దేశంలో తొలిసారిగా మన హైదరాబాద్‌‌  ఆతిథ్యం ఇచ్చిన   ఈ  హిస్టారికల్‌‌ రేస్​ సూపర్‌‌ హిట్‌‌ అయింది. హైదరాబాద్‌‌ స్ట్రీట్‌‌ సర్క్యూట్‌‌పై ఎలక్ట్రిక్‌‌ కార్లు  తమ స్పీడ్‌‌తో ఫ్యాన్స్ ను థ్రిల్‌‌ చేశాయి. ప్రాక్టీస్‌‌ నుంచి ప్రధాన రేసు ఆఖరి క్షణం వరకూ ఉత్కంఠ రేపాయి.  ఈ రేసులో తన డ్రైవింగ్‌‌ స్కిల్స్‌‌తో మెప్పించిన  డీఎస్‌‌ పెన్‌‌స్కీ డ్రైవర్‌‌   జాన్‌‌ ఎరిక్‌‌ వెర్న్​  విన్నర్‌‌గా నిలిచాడు. మొత్తంగా ట్రాఫిక్‌‌ డైవర్షన్స్‌‌తో  సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డా.. మన రోడ్లపై ఫార్ములా కార్ల పరుగులు చూసిన అభిమానులు మురిసిపోయారు..! మళ్లీ వచ్చే ఏడాది హైదరాబాద్​లో ఫార్ములా– ఈ జరుగుతుంది. 

హైదరాబాద్, వెలుగు: సాగర తీరం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. చుట్టూ వేలాది మంది కేరింతల నడుమ.. రయ్‌‌‌‌ రయ్‌‌మంటూ మెరుపు వేగంతో దూసుకెళ్లిన ఎలక్ట్రిక్‌‌ కార్లు ఫ్యాన్స్‌‌కు మస్తు కిక్‌‌ ఇచ్చాయి. 11 జట్లకు చెందిన 22 మంది డ్రైవర్లు తమ రేసింగ్‌‌ స్కిల్స్‌‌ చూపెట్టారు. ఫార్ములా– ఈ చాంపియన్‌‌షిప్‌‌  నాలుగో రౌండ్‌‌ లో భాగంగా  హైదరాబాద్‌‌ గ్రాండ్‌‌ ప్రి  హుస్సేన్‌‌ సాగర్‌‌  సమీపంలో2.83 కి.మీ స్ట్రీట్‌‌ సర్క్యూట్‌‌పై  శనివారం ఉదయం ప్రాక్టీస్‌‌ సెషన్‌‌, మధ్యాహ్నం క్వాలిఫయింగ్​లో ఒక్కొక్కరుగా అలరించిన రేసర్లు.. సాయంత్రం మెయిన్‌‌ రేస్‌‌లో అంతా కలిసి మెస్మరైజ్‌‌ చేశారు.  33 ల్యాప్స్‌‌ పాటు  అనేక మలుపులు తిరుగుతూ..  అత్యంత థ్రిల్లింగ్‌‌గా సాగిన  తుది రేసును 46 నిమిషాల 01.099 సెకండ్లతో అందరికంటే వేగంగా ఫినిష్‌‌ చేసిన  డీఎస్‌‌ పెన్‌‌స్కీ  జట్టు డ్రైవర్‌‌  జాన్‌‌ ఎరిక్‌‌ వెర్న్​  (ఫ్రాన్స్​) విన్నర్‌‌గా నిలిచాడు. సెకండ్‌‌ ప్లేస్‌‌ సాధించిన ఎన్విజన్‌‌ రేసింగ్‌‌ టీమ్‌‌ డ్రైవర్‌‌ నిక్‌‌ కాసిడీ (+0.400 సెకండ్స్‌‌) నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్న ఎరిక్‌‌ 0.5 శాతం కంటే ఎనర్జీ (బ్యాటరీ)తోనే చివరి ల్యాప్‌‌ పూర్తి చేసి ఔరా అనిపించాడు. పోర్షే డ్రైవర్‌‌ ఆంటోనియో ఫెలిక్స్‌‌ డ కోస్టా(+1.859సె) మూడో ప్లేస్‌‌లో పోడియంపైకి వచ్చాడు. వాస్తవానికి ఎన్విజన్‌‌ డ్రైవర్‌‌ సెబాస్టియన్‌‌ బుయెమి మూడో స్థానం సాధించినా.. అధిక పవర్‌‌ వాడిన కారణంగా 17 సెకండ్ల పెనాల్టీ ఎదుర్కొని 15వ స్థానానికి పడిపోయాడు. .హోం టీమ్‌‌ మహీంద్రా రేసింగ్‌‌ డ్రైవర్‌‌ ఒలీవర్‌‌ రోలాండ్‌‌ (+7.138 సె.) ఆరో స్థానంతో  8 పాయింట్లు నెగ్గాడు. మరో డ్రైవర్​ లుకాస్​ డిగ్రాసి (+0.15.999 సె.) 14వ ప్లేస్​తో సరిపెట్టాడు. ప్రమాదాల కారణంగా ఆరుగురు డ్రైవర్లు రేస్ ​పూర్తి చేయలేకపోయారు. ఫార్ములా–ఈ సీజన్‌‌లో ఐదో  రౌండ్‌‌ ఈ నెల 25న కేప్‌‌టౌన్‌‌లో జరుగుతుంది.

థ్రిల్‌‌ చేసిన మెయిన్‌‌ రేస్‌‌


క్వాలిఫికేషన్​ ఫైనల్​ రౌండ్​లో జాగ్వార్‌‌కు చెందిన మిచ్‌‌ ఎవాన్స్ 1.13.288 నిమిషంలో వేగంగా ల్యాప్‌‌ పూర్తి చేసి  పోల్‌‌ పొజిషన్‌‌ దక్కించుకున్నాడు. జాన్‌‌ ఎరిక్‌‌ రెండో స్థానం సాధించాడు. పోల్‌‌ పొజిషన్ల ఆధారంగా 11 జట్లకు చెందిన 22 మంది రేసర్లు మెయిన్‌‌ రేసులో పాల్గొన్నారు. తొలుత 32 ల్యాప్స్‌‌తో మొదలైన ఈ రేసు అనూహ్య మలుపులు, ప్రమాదాలతో థ్రిల్లర్‌‌ సినిమాను తలపించింది. ఏడో ల్యాప్‌‌ వరకు ఎవాన్స్‌‌ (జాగ్వార్‌‌), ఎరిక్‌‌, బుయెమి (ఎన్విజన్‌‌) టాప్‌‌3లో నిలిచారు. ఒక్కసారిగా స్పీడు పెంచిన బుయెమి టాప్‌‌లోకి దూసుకొచ్చాడు. అయితే, 10వ ల్యాప్‌‌లో అటాక్‌‌ మోడ్‌‌ ఉపయోగించుకున్న  ఎరిక్‌‌ 13వ ల్యాప్‌‌లో బుయెమిని వెనక్కునెట్టి లీడింగ్‌‌లోకి వచ్చాడు. మూడో మలుపు వద్ద ఓవర్‌‌ టేక్‌‌ చేసే ప్రయత్నంలో జాగ్వార్‌‌ డ్రైవర్ సామ్‌‌ బర్డ్‌‌ తన టీమ్‌‌ మేట్‌‌ ఎవాన్స్‌‌ కారును ఢీకొట్టాడు. దాంతో, ఇద్దరూ రేసు నుంచి నిష్ర్కమించారు. ఇక్కడి నుంచి ఎరిక్‌‌ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్లాడు. మిగతా రేసర్లు అటాక్‌‌ మోడ్స్‌‌ యాక్టివేట్‌‌ చేసినా అతడిని అందుకోలేకపోయారు. ఇక, 23వ ల్యాప్‌‌లో మెక్‌‌లారెన్‌‌ డ్రైవర్‌‌ జాక్‌‌ హ్యూస్‌‌ కారు ట్రాక్‌‌ మధ్యలో మొరాయించింది. ఈ ఆలస్యం దృష్ట్యా మరో ల్యాప్‌‌ను జత చేశారు. అప్పటికే తన కారులో 60 శాతం బ్యాటరీ పూర్తయినా జాన్‌‌ ఎరిక్‌‌ టాప్‌‌ పొజిషన్‌‌ చేజార్చుకోలేదు. చివర్లో కాసిడీ నుంచి అతనికి గట్టి పోటీ ఎదురైంది. చివరి ల్యాప్‌‌కు వచ్చే సరికి కాసిడీ కారులో 4 శాతం బ్యాటరీ ఉండగా.. ఎరిక్‌‌ కారులో ఒక్క శాతమే మిగిలింది. ఎరిక్ ఆ ఎనర్జీతోనే ఆఖరి ల్యాప్‌‌ పూర్తి చేసి ఈ సీజన్‌‌లో తొలి రేస్‌‌ గెలిచాడు.

చరణ్​తో ఆనంద్​ మహీంద్రా స్టెప్పులు 

పదేండ్ల తర్వాత ఇండియాలో జరిగిన ఫార్ములా రేస్​ఈవెంట్​చూసేందుకు టాప్​ సెలబ్రిటీలు సిటీకి వచ్చారు. ముందుగా హామీ ఇచ్చినట్టే ఎఫ్​ఐఏ ప్రెసిడెంట్​ మొహమ్మద్​ బెన్​ సులయెమ్​ హాజరయ్యారు. క్రికెటర్లు సచిన్​ టెండూల్కర్​, శిఖర్​ ధవన్, యుజ్వేంద్ర చహల్, ధనశ్రీ దంపతులు, సెంట్రల్‌‌‌‌ స్పోర్ట్స్ మినిస్టర్‌‌ అనురాగ్‌‌ ఠాకూర్‌‌, సెంట్రల్‌‌ టూరిజం మినిస్టర్ జి. కిషన్‌‌ రెడ్డి రేస్‌‌ను చూశారు.  రామ్‌‌చరణ్‌‌, నాగార్జున, యశ్​, దుల్కర్ సల్మాన్​​, అఖిల్‌‌, నాగచైతన్య తదితర హీరోలు కూడా హాజరయ్యారు. మోటార్‌‌ రేసింగ్‌‌ను ఇష్టపడే సచిన్‌‌..  పిట్‌‌లేన్‌‌ వద్దకు వచ్చి మహీంద్రా టీమ్‌‌ ఓనర్‌‌ ఆనంద్‌‌ మహీంద్రా, డ్రైవర్లతో మాట్లాడాడు. రామ్‌‌ చరణ్‌‌ తో కలిసి టాప్‌‌ ఎలక్ట్రిక్‌‌ కారులో ట్రాక్‌‌పై ప్రయాణించాడు. ఇక, రామ్‌‌చరణ్​తో కలిసి ఆనంద్‌‌ మహీంద్రా నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. అనంతరం పోడియంపై విన్నర్లకు ఎఫ్‌‌ఐఏ ప్రెసిడెంట్‌‌  సులయెమ్, అనురాగ్‌‌ ఠాకూర్‌‌, రాష్ట్ర  ఐటీ మంత్రి కేటీఆర్‌‌ ట్రోఫీలు అందజేశారు.

రేస్‌‌‌‌ నెగ్గినందుకు హ్యాపీగా ఉంది.   పోటీ చాలా టఫ్‌‌గా సాగింది. చివరి వరకూ  నా టాప్‌‌ ప్లేస్‌‌ను కాపాడుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎలాంటి మిస్టేక్‌‌ చేయకపోవడంతో విజయం సాధ్యమైంది. ఇది మా టీమ్‌‌లోని ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపింది. ఈ సీజన్‌‌లో ఫస్ట్‌‌ విక్టరీ కావడంతో నేను మరింత సంతోషంగా ఉన్నా. హైదరాబాద్‌‌ స్ట్రీట్‌‌ సర్క్యూట్‌‌ కొత్తగా, భిన్నంగా అనిపించింది. కానీ, ట్రాక్‌‌పై చాలా చోట్ల దుమ్ము ఉంది. వచ్చే ఏడాదైనా స్వీపింగ్‌‌ మెషీన్స్‌‌ ఉపయోగించి దుమ్ము లేకుండా చూస్తారని ఆశిస్తున్నా. 
‑ విన్నర్‌‌ జాన్ ఎరిక్​ వెర్న్​