- ఫార్ములా-ఈ ఆపరేషన్స్ కంపెనీకి రెండు విడతల్లో రూ.45.71 కోట్లు చెల్లించాం
- ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే నిధులు ట్రాన్స్ఫర్ చేశాం
- సీజన్ 9లో ట్రాక్, ఇతర అవసరాలకు రూ.12 కోట్లు ఖర్చు చేశాం
- ఫార్ములా–ఈ కేసులో 6 గంటల పాటు విచారణ.. స్టేట్మెంట్ రికార్డు
- మళ్లీ పిలిచినప్పుడు ఎంక్వైరీకి రావాలని ఏసీబీ అధికారుల ఆదేశం
హైదరాబాద్, వెలుగు : హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంలో తన తప్పేం లేదని, సార్ (మున్సిపల్ శాఖ నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్) ఆదేశాల మేరకే లావాదేవీలన్నీ జరిపామని ఏసీబీ విచారణలో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి వెల్లడించినట్టు తెలిసింది. ఫార్ములా–ఈ రేసు కేసులో ఏ3గా ఉన్న బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ శుక్రవారం ప్రశ్నించింది. ఆయన ఉదయం 9:50 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చారు.
ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) డీఎస్పీ మాజీద్ అలీఖాన్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం బీఎల్ఎన్ రెడ్డిని విచారించింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించి, ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి రూ.54.89 కోట్లను మంజూరు చేయడంపై ఏసీబీ ఆరా తీసింది. హెచ్ఎండీఏ రికార్డులు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు ముందట పెట్టి ప్రశ్నించింది.
ఆధారాలతో సహా వివరణ..
అప్పటి ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఆదేశాల మేరకే తాను పని చేశానని ఏసీబీకి బీఎల్‌ఎన్ రెడ్డి వెల్లడించినట్టు తెలిసింది. ‘‘ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నిధుల ట్రాన్స్ ఫర్ జరిగింది. ఫార్ములా–-ఈ ఆపరేషన్స్ కంపెనీకి రెండు విడతల్లో రూ.45.71 కోట్లు చెల్లించాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే నిధులు ట్రాన్స్ ఫర్ చేశాం. ఫార్ములా–ఈ రేసు సీజన్ 9 జరిగినప్పుడు ట్రాక్, ఇతర అవసరాల కోసం హెచ్ఎండీఏ నిధులు రూ.12 కోట్లు ఖర్చు చేశాం” అని ఆయన వివరించినట్టు సమాచారం.
ఈ లావాదేవీలన్నింటికీ సంబంధించి ఆధారాలతో సహా వివరించినట్టు తెలిసింది. సంబంధిత డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు మార్క్ చేశారు. ఈ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వ అనుమతులపై ఏసీబీ ఆరా తీయగా, ఆ అంశం తన పరిధిలో లేదని బీఎల్‌ఎన్ రెడ్డి సమాధానం ఇచ్చినట్టు సమాచారం.
ALSO READ : కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
అకౌంట్ ఆపరేషన్స్‌పై ఆరా..
ప్రధానంగా చీఫ్ ఇంజినీర్ హోదాలో బీఎల్‌ఎన్ రెడ్డి నిర్వహించిన విధుల గురించి ఏసీబీ ఆరా తీసింది. హెచ్‌ఎండీఏ బోర్డుకు చెందిన అకౌంట్స్‌ను ఎవరు ఆపరేట్ చేస్తారని ప్రశ్నిం చింది. నిధుల సమీకరణ, వాటి ఖర్చు, ఏవైనా లాభాలొస్తే ఆ డబ్బు ఏ అకౌంట్‌లో డిపాజిట్ అవు తుంది? అనే అంశాలపై ఆరా తీసింది. ప్రధానం గా హిమాయత్‌నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లోని హెచ్‌ఎండీఏ బోర్డ్ అకౌంట్స్ ఆపరే షన్స్ పై అడిగి తెలుసుకుంది.
ఈ బ్యాంక్ నుంచి ఫార్ములా–ఈ కంపెనీకి 2023 అక్టోబర్ 3, 11 తేదీల్లో ట్రాన్స్ ఫర్ చేసిన రూ.45.71కోట్లకు సంబంధించిన ఇన్‌వాయిస్‌లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌తో ప్రశ్నలు సంధించింది. కాగా, మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏసీబీ ఆదేశించింది.