
- ముగ్గురిని ప్రశ్నించేందుకు షెడ్యూల్ ఖరారు
- వారం రోజుల వ్యవధిలో మరోసారి స్టేట్‌మెంట్లు రికార్డ్
- కీలకంగా అర్వింద్ కుమార్, ఎఫ్‌ఈవో ప్రతినిధుల స్టేట్‌మెంట్స్
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేసు కేసు కీలక దశకు చేరుకుంది. ప్రధాన నిందితుడైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మరోసారి విచారించేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేశారు. కేటీఆర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అర్వింద్‌కుమార్, రిటైర్డ్ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డిని కూడా ప్రశ్నించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
ఈ వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురిని విచారించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగంపై జనవరి 8న ఐఏఎస్ అర్వింద్‌కుమార్, 9న కేటీఆర్,10న హెచ్‌ఎండీఏ బోర్డ్ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని అదే నెల18న గ్రీన్‌కో ఏస్ నెక్స్ట్‌జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను విచారించారు. వీరిచ్చిన స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు.
అలాగే ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను వారి స్టేట్‌మెంట్స్ ఆధారంగా మార్క్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను ఇటీవల వర్చువల్‌గా ప్రశ్నించారు. ఎఫ్‌ఈవో సీఈవోను శుక్రవారం జూమ్ మీటింగ్ ద్వారా విచారించారు.
కేటీఆర్ సహకారంతోనే: ఎఫ్‌ఈవో, ఏస్ నెక్ట్స్ జెన్
కేసులో నిందితులైన అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి సహా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఏస్ నెక్స్ట్ జెన్, ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రతినిధులు కూడా కేటీఆర్ పేరునే ప్రధానంగా ప్రస్తావించారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా కేటీఆర్ ఆదేశాల మేరకే ఫార్ములా ఈ రేసు ప్రపోజల్స్, లండన్ కంపెనీతో సంప్రదింపులు, అగ్రిమెంట్లు, చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ సేకరించింది.
వీటి ఆధారంగా ముగ్గురు నిందితులను మరోసారి ప్రశ్నించేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఏసీబీ వద్ద డాక్యుమెంట్లతో క్రాస్ క్వశ్చనింగ్ చేయనుంది. ప్రధానంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్(ఎంఏయూడీ), హెచ్‌ఎండీఏ బోర్డు రికార్డుల ఆధారంగా ఏసీబీ సమాచారం రాబడుతున్నది. అప్పటి ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అర్వింద్‌కుమార్ అందించిన వివరాలు దర్యాప్తులో కీలకంగా మారాయి.
అర్వింద్‌కుమార్ వాంగ్మూలంతో కేటీఆర్‌కు చిక్కులు
ఈ కార్ రేసింగ్ వల్ల తనకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం కలుగలేదని అంతా కేటీఆర్ చెప్పిన విధంగానే చేసినట్లు అర్వింద్‌కుమార్ ఇప్పటికే ఏసీబీ ముందు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. 2022 అక్టోబర్ 25న ఎంఏయూడీ, ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్ జెన్‌ల మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం, అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే 2023 అక్టోబర్ 10న ఎంఏయూడీ, ఎఫ్‌ఈవో మధ్య జరిగిన అగ్రిమెంట్లకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఏసీబీకి అందించాడు.
స్టేట్‌మెంట్‌ను ఇప్పటికే ఏసీబీ అధికారులు సీల్డ్ కవర్‌లో కోర్టులో డిపాజిట్ చేశారు. ట్రాక్ నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏ బోర్డ్ నిధుల నుంచి చెల్లించిన రూ.12 కోట్లు.. సహా నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌ఎండీఏ బోర్డు నుంచి మళ్లించిన రూ.55 కోట్లకు సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్లను కోర్టుకు అందించింది.