సీఎస్​కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి లేఖ

సీఎస్​కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి లేఖ
  • కేవలం పదవుల కోసమే కార్పొరేషన్లు అన్నట్టు తయారైంది 
  • అవి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి
  • పనిచేయని వాటిని మూసేయండి, కొత్తవి పెట్టొద్దు
  • ఏటా రూ.రెండు కోట్లు వృథాగా ఖర్చు చేస్తున్నారని వెల్లడి

హైదరాబాద్ : రాష్ట్రంలో కార్పొరేషన్లు, డెవలప్ మెంట్ అథారిటీలు 70 వరకు ఉండగా, వాటిలో కొన్ని మినహా మిగతావన్నీ కేవలం రాజకీయ పదవుల కోసమే ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఏ అవసరం లేకున్నా చైర్మన్ల నియామకం కోసమే కార్పొరేషన్లను కొనసాగిస్తున్నారన్నారు. చైర్మన్ల నియామకం, వెహికల్, సిబ్బందికి జీతాలు.. ఇలా ప్రతి సంవత్సరం రూ.రెండు కోట్ల మేర ప్రజాధనం వృథా అవుతోందన్నారు. కార్పొరేషన్ల పనితీరుపై సర్కారు ఎన్నడూ రివ్యూలు కూడా చేయలేదన్నారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్​ కుమార్​కు పద్మనాభరెడ్డి మంగళవారం లేఖ రాశారు.

పశుసంవర్థక శాఖలో డైరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్, గొర్రెల, మేకల డెవలప్ మెంట్ కార్పొరేషన్, చేపల పెంపకం డెవలప్ మెంట్ కార్పొరేషన్ తోపాటు మరో కార్పొరేషన్  కూడా ఉందని, ఆ కార్పొరేషన్ల పనంతా డిపార్ట్ మెంట్ చేయొచ్చని లేఖలో పేర్కొన్నారు. బీసీ వెల్ఫేర్​లో లెక్కకు మించి కార్పొరేషన్లు ఉన్నాయన్నారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయని, మూతబడిన వాటితోపాటు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అవన్నీ రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రాలుగా మారాయని, పనిలేని కార్పొరేషన్లు మూసివేసి, కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేయకుండా చూడాలని సీఎస్​ను కోరారు.