- సీఎం రేవంత్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
హైదరాబాద్, వెలుగు: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) చీఫ్ కమిషనర్, కమిషనర్లను నియమించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి శనివారం లేఖ రాశారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్టీఐ కమిషనర్లంతా రిటైర్ అయ్యారని, గత 18 నెలల నుంచి కమిషన్ పనిచేయడం లేదని, దీంతో 15 వేల అప్పీళ్లు పెండింగ్ లో ఉన్నాయని లేఖలో ఆయన గుర్తు చేశారు.
చీఫ్ కమిషనర్, కమిషనర్ల ఎంపికలో విశాలమైన విషయపరిజ్క్షానం, చట్టం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, మేనేజ్‌మెంట్, జర్నలిజం, లా, పరిపాలనలో అనుభవమున్నవారిని నియమించాలని ఆర్టీఐ యాక్ట్ లో ఉందని, ఎంపికలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని పద్మనాభరెడ్డి కోరారు. ఆర్టీఐ ఖాళీగా ఉండటం వల్ల ప్రభుత్వ కార్యాలయల్లో ఆర్టీఐ కింద సమాచారం అడిగితే అధికారులు ఆ అప్లికేషన్లను పట్టించుకోవడం లేదని ఆయన గుర్తు చేశారు. సాధ్యమైనంత త్వరలో ఆర్టీఐ చీఫ్ కమిషనర్, కమిషనర్లను నియమించాలని ఆయన కోరారు.