
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ టవర్లలో నివసిస్తున్న వారికి సౌలతులు కల్పించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి కోరారు. పేద, మధ్య తరగతి ప్రజలు లోన్లు తీసుకొని ఈ టవర్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ఉంటున్నారని తెలిపారు. ఈ టవర్లలో రోడ్లు, వాటర్, పార్కింగ్ సమస్యలు ఉన్నాయని వీటిని వెంటనే పరిష్కరించాలని చెప్పారు. మంగళవారం ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.
2007లో ఉమ్మడి రాష్ర్టంలో అప్పటి ప్రభుత్వం రూ.1,809 కోట్లు ఖర్చు చేసి ఈ టవర్లను నిర్మించిందని ఆయన గుర్తు చేశారు. టవర్లను అమ్మడంతో రూ.763 కోట్లు మాత్రమే వచ్చాయని, దీంతో ప్రభుత్వానికి నష్టం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికి చాలా ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం వేలం వేసినా వసతులు లేక కొనేందుకు ప్రజలు ముందుకు రావటం లేదని ఆయన లేఖలో వివరించారు. రాజీవ్ స్వగృహ టవర్లలో ఇంకా పనులు చేపట్టాల్సి ఉందని వాటిని వెంటనే పూర్తి చేయాలని కోరారు.