
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంతో పాటు సిటీలో విపరీతమైన ఆహారకల్తీ జరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి తెలిపారు. శనివారం సీఎం రేవంత్ కు ఆయన లేఖ రాశారు. సెవెన్ స్టార్ హోటళ్ల నుంచి రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న హోటళ్ల వరకు ఆహారం కల్తీ జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ సిటీలో పెద్ద సంఖ్యలో హోటళ్లు ఉండడంతో వాటికి సరిపడా ఫుడ్ సేప్టీ అధికారులు లేనందున ఆహార కల్తీ వ్యవహారం తీవ్రమైందని పేర్కొన్నారు.
రాష్ట్రంలొ ఒకటే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉందని, అందులో టెస్టుల కోసం సరియైన పరికరాలు లేవని వివరించారు. ఈ ల్యాబ్ కు సైంటిస్టులు, ఇతరులు కలిపి 78 పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 11 మంది మాత్రమే పనిచేస్తున్నారని, వెల్లడించారు. గతంలో ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆహార కల్తీ గురించి ప్రజలు ఫిర్యాదు చేయడానికి ఒక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని తెలిపారు.