ములుగు, వెలుగు : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ కోరారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేపట్టిన జన చైతన్య బస్సు యాత్ర సోమవారం ములుగు పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద ఉద్యమకారుల చైతన్య యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాటు ఉద్యకారులను పట్టించుకోలేదని, అందుకే ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారన్నారు.
ఉద్యమకారుల అండతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, 250 గజాల ఇంటి స్థలంతో పాటు పెన్షన్, గుర్తింపుకార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలుచేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 27న హైదరాబాద్‌లో ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మురారి భిక్షపతి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి భద్రయ్య, అబ్బా గోపాలరెడ్డి, పత్తి గోపాల్‌రెడ్డి, రేండ్ల సంతోష్, దగ్గు ప్రభాకర్‌రావు, కూరెళ్ల రామాచారి, ఓదెలు, గడ్డమీది భాస్కర్ పాల్గొన్నారు.