- హాజరుకానున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించిన పరిగి ఎమ్మెల్యే, అధికారులు
హైదరాబాద్/వికారాబాద్/ పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో ఈ నెల15న నేవీ రాడార్ కేంద్రానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డిని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్, నేవీ అధికారులు ఆహ్వానించారు. గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో వారు సీఎంను కలిసి ఆహ్వాన లేఖ అందించారు.
దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను నేవీ ఇక్కడ నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ ను ఉపయోగిస్తుంది. కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. గురువారం కలెక్టరేట్ప్రాంగణంలో చాపర్ తో నేవీ అధికారులు ట్రయల్ ల్యాండింగ్ చేశారు.
శంకుస్థాపనకు వచ్చి కలెక్టరేట్లో ల్యాండ్అయ్యే వీఐపీలు అక్కడి నుంచి దామగుండం అటవీ ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని పరిశీలించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, నేవీ ఆఫీసర్లు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తొలగిన అడ్డంకులు..
నేవీ రాడార్ కు సంబంధించి దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది. 2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్ లు వచ్చినప్పటికీ.. గత ప్రభుత్వం భూముల కేటాయించలేదు.
ఈ ఏడాది జనవరిలో కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం వికారాబాద్ డీఎఫ్ వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.