అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన..

అమరావతిలో సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన..

సీఎం చంద్రబాబు అమరావతిలో కొత్త ఇల్లు నిర్మించనున్నారు. ఇంటి నిర్మాణ పనులకు బుధవారం ( ఏప్రిల్ 9 ) శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు.వేద పండితుల ఆధ్వర్యంలో శంకుస్థాపన పూజా కార్యక్రమం జరిగింది.భూమి పూజ కార్యక్రమంలో  సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం జరగనుంది.రాజధాని కోర్ ఏరియాలో వెలగపూడి పరిధిలో సీఎం చంద్రబాబు నివాసం ఉండనుంది.

కాగా..2024 డిసెంబరులో చంద్రబాబు వెలగపూడి పరిధిలో 5 ఎకరాల రెసిడెన్షియల్ ఫ్లాట్ ను అదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు సంగతి తెలిసిందే. ఈ స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా ఇటీవలే పూర్తయ్యింది. ఐదు రోజుల కిందట ప్రారంభించిన భూమి చదును పనులు మంగళవారానికి పూర్తైన క్రమంలో... బుధవారం సతీమణి భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణి, దేవాన్ష్‌లతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు.

ఈ ఇంటిని 1 వెయ్యి 455 చదరపు అడుగుల్లో జి ప్లస్‌ 1లో నిర్మించనున్నారు. ఇంటి నిర్మాణ బాధ్యతలు ఎస్‌ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంటి పనులు ఏడాదిలోపే పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.