హైదరాబాద్, వెలుగు : అమరరాజా గ్రూప్ మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో సెల్ తయారీ కోసం కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (సీక్యూపీ) శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించింది. భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక ఆటోమోటివ్ బ్యాటరీ మేజర్‌లలో ఒకటైన అమర రాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్ (ఏఆర్ఏసీటీ)కి అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ (ఏఆర్ఈఎం) పూర్తి అనుబంధ సంస్థ. బ్యాటరీ ప్యాక్ ప్లాంట్ మొదటిదశను 1.5 గిగావాట్అవర్ప్రస్తుత సామర్థ్యంతో, రూ.9,500 కోట్ల పెట్టుబడితో ప్రారంభించింది.
ఈ ప్లాంట్ భారతీయ పరిస్థితులకు ప్రత్యేకంగా లీఅయాన్ బ్యాటరీ ప్యాక్‌లను తయారు చేస్తుంది. స్టేషనరీ ఎనర్జీ స్టోరేజ్ అవసరాల కోసం వీటిని ఈవీ కంపెనీలకు సరఫరా చేస్తుంది. ఈ ప్లాంటు వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో పనిచేయడం మొదలుపెడుతుంది. ఇదిలా ఉంటే, అమర రాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్ (ఏఆర్ఏసీటీ) బ్యాటరీల తయారీ కోసం ఇటాలియన్ ఆటో కంపెనీ పియాజియో తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా, అమర రాజా పియాజియో ఇండియాతో కలిసి లిథియం ఐరన్ ఫాస్ఫేట్, లిథియం- అయాన్ సెల్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జర్‌లను అభివృద్ధి చేయడంతో పాటు సెల్‌లు బ్యాటరీ ప్యాక్‌లను డెవలప్ చేస్తుంది. వీటిని దివిటిపల్లిలోని అమర రాజాస్ గిగాఫ్యాక్టరీలో ఉత్పత్తి చేస్తారు.