కాంగ్రెస్‌‌ మాయమాటలను ప్రజలు నమ్మరు : ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

  • నాకు నచ్చిన సీఎంలు ఎన్‌‌టీఆర్‌‌, కేసీఆర్‌‌

రాయపర్తి, వెలుగు : కాంగ్రెస్‌‌ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని పనులు తెలంగాణలో చేస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని పంచాయతీరాజ్‌‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు ప్రశ్నించారు. వరంగల్‌‌ జిల్లా రాయపర్తిలో శనివారం సెంట్రల్‌‌ లైటింగ్‌‌ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రూరల్‌‌ మార్ట్‌‌ను ప్రారంభించారు. స్వర్ణ భారతి మండల సమాఖ్య 14వ వార్షికోత్సవానికి చీఫ్‌‌ గెస్ట్‌‌గా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాభివృద్ధే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌‌కే దక్కుతుందన్నారు. మాయమాటలతో అధికారంలోకి రావాలని చూస్తున్న వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న ఉద్దేశంతోనే ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. తనను ఏడుసార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానన్నారు.

 తన రాజకీయ జీవితంలో తనకు నచ్చిన సీఎంలు ఇద్దరేనని, ఇందులో ఒకరు ఎన్‌‌టీఆర్‌‌ అయితే మరొకరు కేసీఆర్‌‌ మాత్రమేనన్నారు. తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. కలెక్టర్‌‌ ప్రావీణ్య, బీఆర్‌‌ఎస్‌‌ మండల అభివృద్ధి కమిటీ చైర్మన్‌‌ బిల్లా సుధీర్‌‌రెడ్డి, మండల అధ్యక్షుడు నరసింహనాయక్, రైతుబంధు మండల అధ్యక్షుడు సురేందర్‌‌రావు, ప్రధాన కార్యదర్శి మధు, సర్పంచ్‌‌ నర్సయ్య పాల్గొన్నారు.

తెలంగాణ వచ్చాకే కులవృత్తులకు గౌరవం

పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్మించనున్న పద్మశాలి కల్యాణ మండప నిర్మాణానికి శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే కుల వృత్తులకు గౌరవం దక్కిందన్నారు. పద్మశాలి కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే బతుకమ్మ చీరలు నేసే బాధ్యతను వారికి అప్పగించినట్లు చెప్పారు. నేతన్నలు గౌరవంగా బతికేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌‌కే దక్కుతుందన్నారు. కల్యాణ మండప నిర్మాణానికి మొత్తం రూ. 40 లక్షలు అవుతుందని, ప్రస్తుతం రూ. 20 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. 

అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. అనంతరం మహాత్మా హెల్పింగ్‌‌ హ్యాండ్స్‌‌ సంస్థ ఆధ్వర్యంలో పాలకుర్తిలోని బషారత్‌‌ గార్డెన్స్‌‌లో ఏర్పాటు చేసిన బ్లడ్‌‌ డొనేషన్‌‌ క్యాంప్‌‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా 99 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏసీపీ రఘుచందర్, వందేమాతరం వ్యవస్థాపకుడు రవీందర్, మహాత్మా హెల్పింగ్‌‌ హ్యాండ్స్‌‌ వ్యవస్థాపకులు గంట రవీందర్‌‌, సభ్యులు పోతుగంటి నర్సయ్య, జక్కుల రవీందర్‌‌, సోము పాల్గొన్నారు.