తెలంగాణ ఉద్యమంలో గద్దర్‌ పాటదే ముఖ్యపాత్ర : వెన్నెల

తెలంగాణ ఉద్యమంలో గద్దర్‌ పాటదే ముఖ్యపాత్ర : వెన్నెల

రామచంద్రాపురం, వెలుగు :  తెలంగాణ  స్వరాష్ట్ర ఉద్యమంలో గద్దర్‌ పాటే ముఖ్య పాత్ర పోషించిందని, ఆయన గళంతో ఉద్యమానికి ఊపిరి పోశారని సాంస్కృతిక సారథి చైర్మన్‌, గద్దర్‌ కూతురు వెన్నెల అన్నారు. అణగారినవర్గాల్లో వెలుగు నింపడానికి గద్దర్‌ తన జీవితాన్నే అంకితం చేశారన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గద్దర్‌ స్మృతివనం నిర్మాణానికి తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, గద్దర్‌ గళం ఫౌండర్‌ కొల్లూరి సత్తయ్యతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు.

 అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గద్దర్‌ పాత్ర ఎప్పటికీ మరువలేమని, తెలంగాణ అస్తిత్వం కోసం చివరి వరకు పోరాడారని గుర్తు చేశారు. ఆయన గొప్పతనాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. అనంతరం గద్దర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. కార్యక్రమంలో రచయిత పసునూరి రవీందర్‌, మాజీ కౌన్సిలర్‌ భరత్‌, రవి, శ్రీను, వివేక్‌ తదితరులు పాల్గొన్నారు.