- హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా దామగుం డం అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) నేవీ రాడర్ కేంద్రానికి మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి, కేంద్ర నావికాదళ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. జాతీయ భద్రత, ఇంటెలిజెన్స్, నేవీ అధికారులు కలెక్టరేట్లో కార్యక్రమ నిర్వహణ పై చర్చించారు. 750 మంది పోలీసులతో భారీ బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు.
వీఐపీలు వచ్చే చాపర్ల ల్యాండింగ్ కోసం మూడు హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఇప్పటికే ఒక హెలీప్యాడ్ ఉం డగా, మరో హెలీ ప్యాడ్‌ను నిర్మించారు. రక్షణ శాఖకు చెందిన చాపర్లు ఇక్కడ ట్రయల్స్ నిర్వహించాయి. వీఐపీలు ఇక్కడ ల్యాండ్అయ్యాక రోడ్డు మార్గం నుంచి దామగుండం అటవీ ప్రాంతానికి వెళ్లడానికి మున్సిపల్ అధికారులు సుమారు 6 కిలో మీటర్ల మేర రోడ్డు రిపేర్ పనులు చేశారు. రోడ్డుకు రెండు వైపులా ఉన్న పిచ్చి మొక్కలు, చెట్ల పొదలను తొలగించారు. శంకుస్థాపన చేసేచోట శిలాఫలకం, స్టేజీ నిర్మాణం, కార్యక్రమానికి వచ్చే అధికారులు, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు.