ఉప్పల్, వెలుగు: ఉప్పల్ శిల్పారామంలో రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న చేనేత భవన నిర్మాణానికి సోమవారం మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించే మ్యూజియం భవనాల నిర్మాణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌కు ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి పనులను వివరించారు. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ జాతీయ రహదారి మెయిన్ రోడ్డు కారిడార్ పనులు పూర్తయ్యేందుకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఉప్పల్ బగాయత్ లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌కు రెండు ఎకరాలు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కు రెండు ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ యల్. రమణ, గ్రేటర్వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
మూడేండ్లలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతయ్
రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మూసీ నది సుందరీకరణ, నది ఒడ్డున ట్రామ్, నదిపై ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి అధ్యక్షతన సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మొదటిసారిగా హైదరాబాద్ సిటీ కన్వర్జెన్స్ మీటింగ్ నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజల సమస్యల పరిష్కారంలో జీహెచ్ఎంసీ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. అన్ని శాఖల అధికారులు ఒక్క దగ్గర ఉండాలనే లక్ష్యంతో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేశామన్నారు. అధికారులు భేషజాలకు వెళ్లకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ నెల 15 వరకు డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. పాతబస్తీలో రోడ్ల విస్తరణకు కేటాయించిన రూ.150 కోట్లు వినియోగించాలన్నారు. మూసీ నదిపై 14 బ్రిడ్జిలకు త్వరలో శంకుస్థాపన చేయాల్సి ఉందని, త్వరలో టెండర్లు పూర్తి చేయాలన్నారు. గ్రేటర్ పరిధిలోని పబ్ లు, హుక్కా సెంటర్లు, పాఠశాలలు, ఫామ్ హౌస్ ల చుట్టూ పోలీసు నిఘా పెంచాలని, గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. మల్టీ లెవెల్ పార్కింగ్ కు ప్రణాళిక రచించాలని, అందుకోసం ఖాళీ ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రైవేటు స్థలాలను కూడా గుర్తించాలన్నారు. రహదారులపై యూటర్న్ ల ఏర్పాటు అంశంలో ట్రాఫిక్ పోలీసులు ముందుగా జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించాలని మంత్రి ఆదేశించారు. మునిసిపాలిటీ శాఖ పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, జల మండలి ఎండీ దానకిశోర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.