వరంగల్, వెలుగు: చింతపండు బస్తాల్లో గంజాయి పెట్టి రవాణా చేస్తున్న నలుగురిని హనుమకొండ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ దేవేందర్‌రెడ్డి వెల్లడించారు. ఏపీలోని ఎన్‌టీఆర్ జిల్లా వీర్లపాడు పొన్నవరానికి చెందిన ఈదర కృష్ణ, అనుముల వెంకటరమణ సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో గంజాయి వ్యాపారం చేస్తున్నారు.
ఈ క్రమంలో సీలేరుకు చెందిన సురేశ్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొన్నారు. దీనిని హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన అబ్దుల్ రహీం, మధ్యప్రదేశ్ రాష్ట్రం రీవా జిల్లా, మన్ఘవ్ ధారావిఘకు చెందిన మైనర్‌కు ఇచ్చేందుకు చింతపండు, యూరియా బస్తాల్లో గంజాయిని పెట్టి బస్సులో హనుమకొండ తీసుకొచ్చారు. బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఎస్సై శ్రవణ్‌కుమార్ సిబ్బందితో వెళ్లి కృష్ణ, వెంకటరమణ, అబ్దుల్ రహీంతో పాటు మైనర్‌ను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.2.35 లక్షల విలువైన 9.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీలేరుకు చెందిన సురేశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి ముఠాను పట్టుకున్న ఇన్స్‌పెక్టర్ సతీశ్, ఎస్సై శ్రావణ్‌కుమార్, సిబ్బందిని ఏసీపీ దేవేందర్‌రెడ్డి అభినందించారు.