
మంచిర్యాల, వెలుగు: గంజాయి తరలిస్తున్న నలుగురిని మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇంధనపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా నలుగురు వ్యక్తులు రెండు బైక్ లపై అనుమానాస్పదంగా వచ్చారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా అదుపులోకి తీసుకుని విచారించారు.
జునోజు రాజేశ్, సయ్యద్ సమీర్, ఆకుల బాలాజీ, ఎనగందుల వినయ్ లు కొంతకాలంగా గంజాయి తాగుతూ.. ఈజీగా మనీ సంపాదించేందుకు ప్లాన్ చేశారు. వినయ్ కి తెలిసిన ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి ప్రాంతానికి చెందిన నగేశ్ వద్ద రూ. 5 వేలకు కిలోపావు గంజాయి కొన్నారు. జన్నారం మండలంలోని గ్రామాల్లో ఎక్కువ రేటుకు అమ్మేందుకు తరలిస్తూ పట్టుబడ్డారు.
నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద రూ. 50 వేల విలువైన 1.20 కిలో గ్రాముల గంజాయి, రెండు బైక్ లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ నరేందర్, జన్నారం ఎస్ఐ రాజవర్ధన్, సిబ్బంది ఉన్నారు.