కోల్‌బెల్ట్, వెలుగు : మేకను ఎత్తుకెళ్లారన్న ఆరోపణలపై కిరణ్, తేజ అనే దళిత యువకులను షెడ్డులో వేలాడదీసి కొట్టిన కేసులో నలుగురిని మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య వివరాలను వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు కారకులైన స్థానిక అంగడిబజార్‌కు చెందిన కొమురాజు రాములు- స్వరూప దంపతులు, వారి కుమారుడు శ్రీనివాస్‌ను శనివారం రాత్రి, వారి సహాయకుడు అజ్మీరా నరేశ్(సోమగూడెం) ను ఆదివారం అరెస్టు చేశామని ఏసీపీ తెలిపారు. అనంతరం నిందితులను ఆదిలాబాద్ జైలుకు రిమాండ్ కు పంపించామని వెల్లడించారు.
వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. కాగా, రాములు కుటుంబ సభ్యుల చేతిలో దాడికి గురై కనిపించకుండా పోయిన బాధితుడు చిలుముల కిరణ్‌ను పోలీసులు ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తించారు. బాధితుడిని యాపల్ ప్రాంతంలోని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతడిని గుర్తించడంలో కృషిచేసిన సీఐలు, ఎస్సైలను ఏసీపీ అభినందించారు. మరోవైపు దళితులపై దాడులను దృష్టిలో పెట్టుకొని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఆదేశాలతో గ్రామాల్లో ‘సివిల్ రైట్స్ డే’ నిర్వహిస్తున్నామని ఏసీపీ తెలిపారు.