ఖమ్మం టౌన్, వెలుగు: ఫేక్ఆధార్, పాన్ కార్డులు, పాస్ పోర్టులతో 19 ఏండ్ల కింద దేశంలోకి చొరబడి ఖమ్మం సిటీలో ఉంటున్న నలుగురు బంగ్లాదేశీయులను త్రీ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. అరెస్టయిన వారిలో ఎండీ నూర్ నబీ(32) అలియాస్ షేక్ నూర్ నబీ, మహమ్మద్ సాగర్(24) అలియాస్ బోడ సాగర్, షేక్ జమీర్(30) అలియాస్ మహమ్మద్ జమీర్, మహమ్మద్ అమినూర్ మండల్(26) ఉన్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు.
నూర్నబీ, సాగర్ సోదరి, జమీర్ కు దూరపు బంధువైన శాగురి ఖాటూన్ అలియాస్ శిల్ప కొన్నేండ్ల కింద బంగ్లాదేశ్నుంచి కోల్కతా, ముంబయి మీదుగా ఖమ్మం వచ్చి బోడ రాములుతో సహజీవనం చేస్తోంది. వీరు శ్రీనివాస్ నగర్ లో ఉంటున్నారు.శిల్ప సహకారంతో నలుగురు నిందితులు ఇండియాలోకి అక్రమంగా చొరబడ్డారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఖమ్మం వర్తక సంఘం భవనంలో ఆధార్ కార్డులు పొందారు.
మహమ్మద్ నూర్ నబీ, షేక్ నూర్ నబీగా కార్డు పొందాడు. షేక్నూర్ నబీ..తన బావ బోడ రాములును తండ్రిగా, అక్క శిల్పను అమ్మగా చెప్పి కార్డు తీసుకున్నాడు. అలాగే మహమ్మద్ జమీర్.. షేక్ జమీర్ గా కార్డు పొందాడు.. మండల్బంగ్లాదేశ్నుంచి అక్రమంగా బెంగళూరు వచ్చి సెంట్రింగ్ పనిచేస్తూ మిత్రుడి సాయంతో ఆరేండ్ల కింద ఖమ్మం వచ్చాడు. నూర్నబీ ఖమ్మంలోని సుందరయ్య నగర్ లో, మహ్మద్సాగర్ ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో, మిగిలిన ఇద్దరు శ్రీనివాస్ నగర్ లో నివసిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.