ఉత్తరాఖండ్​ దుర్ఘటన: ఇంకా ఐదుగురు మిస్సింగ్

ఉత్తరాఖండ్​ దుర్ఘటన: ఇంకా ఐదుగురు మిస్సింగ్
  • మంచు చరియల కింద గాలిస్తున్న రెస్క్యూ టీమ్​లు
  • ఉత్తరాఖండ్​ దుర్ఘటనలో 50 మందిని కాపాడిన అధికారులు
  • చికిత్స పొందుతూ అందులో నలుగురు మృతి

న్యూఢిల్లీ:ఉత్తరాఖండ్​లో మంచు చరియలు విరిగి పడిన ఘటనలో బార్డర్ రోడ్​ ఆర్గనైజేషన్ (బీఆర్వో) ​కు చెందిన నలుగురు కార్మికులు మృతిచెందారు. మరో ఐదుగురి ఆచూకీ లభించలేదు. మొత్తం 55 మంది అక్కడ చిక్కుకుపోగా.. 50 మందిని ఆర్మీ అధికారులు రక్షించారు. గల్లంతైన వారి కోసం మంచు చరియల కింద వెతుకుతున్నట్లు తెలిపారు. ఉత్తరాఖండ్‌‌‌‌‌‌లో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా హిమపాతం కురుస్తున్నది. 

మంచు గుట్టలా పేరుకుపోయింది. ఈ క్రమంలో టిబెట్​బార్డర్​కు సమీపంలో చమోలి–బద్రీనాథ్‌‌‌‌‌‌‌‌ రహదారిపై ఏర్పాటు చేసిన బీఆర్వో శిబిరంపై పెద్దఎత్తున మంచు చరియలు విరిగిపడ్డాయి. దాంతో అక్కడ పనిచేస్తున్న 55 మంది బీఆర్వో కార్మికులు మంచులో చిక్కుకుపోయారు. 

శుక్రవారం ఉదయం 7.15 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే  అధికారులు వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 50 మందిని ప్రాణాలతో బయటికి తీశారు. వారికి మన గ్రామంలో ఏర్పాటు చేసిన ఐటీబీపీ శిబిరంలో చికిత్స అందిస్తున్నారు. కాగా, ఇందులో పరిస్థితి విషమించి నలుగురు మృతిచెందినట్టు వెల్లడించారు. 

వర్షంతో సహాయక చర్యలకు ఆటంకం

మంచు చరియలు విరిగిపడ్డ ప్రదేశం సముద్ర మట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ మంచుతో కూడిన వర్షం దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నది. అయినా.. ఐబెక్స్​ బ్రిగేడ్​కు చెందిన 100 మందికిపైగా సిబ్బంది సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. మంచు చరియల కింద చిక్కుకున్న 33 మందిని శుక్రవారం రక్షించగా.. మరో 17 మందిని శనివారం సురక్షితంగా బయటకు తెచ్చారు. 

వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో హెలికాప్టర్​లో జోషిమఠ్​కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ఐదుగురిని రక్షించేందుకు మరో 4 బృందాలను రంగంలోకి దింపినట్టు ఎన్​డీఆర్​ఎఫ్​ తెలిపింది. 

కాగా, సహాయక చర్యలను సీఎం పుష్కర్​ సింగ్ ​ధామి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు.హిమపాతానికి సంబంధించిన సమాచారం లేదా సహాయం కోసం ఆ రాష్ట్ర సర్కారు హెల్ప్​ లైన్​ నంబర్లను జారీ చేసింది.